నన్ను అనుమానించావు.. ఇక సెలవు | Sakshi
Sakshi News home page

ఏం కష్టం వచ్చిందో..!

Published Fri, Jan 11 2019 6:51 AM

Married Woman Commits Suicide in Srikakulam - Sakshi

శ్రీకాకుళం, పొందూరు: మండలంలోని తండ్యాం పంచాయతీ శ్రీరామ్‌నగర్‌ కాలనీలో వివాహిత మృతి కలకలం రేపింది. మేదరమెట్ల సంధ్య(28) మృతి ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. ఆమె మరణించిన తీరు మండల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సంధ్యది ఆత్మహత్యేనని పోలీసులు అంటున్నారు. కాదు అది హత్యేనని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. వివరాల్లోకి వెలితే... తండ్యాం పంచాయతీలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో మేదరమెట్ల వెంకటరమణ, సంధ్య నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం వీరికి ప్రేమ వివాహమైంది. వీరికి పాప లహరి పుట్టి ఏడాది గడచింది. ఏం జరిగిందో ఏమో గాని ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందింది.

గురువారం ఉదయమే సంధ్య మరణవార్త ఆమె సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్లో తెలిపారు. దీంతో అతడు సంధ్య ఇంటికి వెళ్లి చూసేసరికి మరణించి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ భాదుషా వెళ్లి మృతురాలిని చూసి ఎస్‌ఐ బాలరాజుకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి సీఐ వై.రామకృష్ణ, డీఎస్పీ భీమారావుకు తెలియజేశారు. వారు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్‌ టీం వచ్చి వివరాలను సేకరించింది. మృతురాలు సంధ్య ఉరి వేసుకొన్నట్టు ఉరికి ఉపయోగించిన వస్త్రాలను భర్త వెంకటరమణ డీఎస్పీ, సీఐలకు అందించారు. రాత్రి పడుకొనేటప్పుడు ఎటువంటి గొడవ జరగలేదని, తాను గురువారం ఉదయం నిద్రలేచేసరికి తన భార్య ఉరివేసుకొన్నట్టు గమనించి వస్త్రాన్ని కోసానని కింద పడిపోవటంతో అందరికి ఫోన్లు చేశానని వెంకటరమణ తెలిపాడు. పోలీసు అధికారులు ఇంటిని పరిశీలించగా మృతురాలు రాసిన లేఖ లభ్యమైందని చెప్పారు. ఈ లేఖలో తన భర్త ఇబ్బందులు పెడుతూ అనుమానిస్తుండటంతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఉందని తెలిపారు. దీంతో ఇది ఆత్మహత్యగా ధృవీకరించామని చెప్పారు. కాగా, తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తి, ఆర్‌ఐ ఈశ్వరరావు, వీఆర్‌ఓలు అంకమ్మ, అసిరయ్య, సీతయ్యల సమక్షంలో పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం
అయ్యో పాపం చిన్నారి
తల్లి మృతి చెందడంతో ఏడాది చిన్నారి లహరిని చూసి గ్రామస్తులు అయ్యో పాపం అని చలించిపోయారు. క్షణం కూడా తల్లిని విడిచి ఉండలేని పాప ఏడుస్తుంటే అందరూ చూసి కంటతడి పెట్టుకొన్నారు. పాప బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేయడమే తప్ప పాపను ఓదార్చడంలో విఫలమయ్యారు.

ఇది హత్యే...
తమ కుమార్తె సంధ్యది హత్యేనని ఆమె తల్లిదండ్రులు కాళ్ల వరలక్ష్మి, శంకరరావు తెలిపారు. నిత్యం తాగడం తన కుమార్తెను హింసించడం, కొట్టడం వంటివి అల్లుడు చేసేవాడని అంటున్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని చెబుతున్నారు. కచ్చితంగా తమ కుమార్తెను అల్లుడు హత్య చేశాడని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేదని, రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు.  అల్లుడే హత్య చేశాడని చెబుతున్నారు.

సంఘటనా స్థలంలో పరిశీలన బట్టి ఆత్మహత్యే...
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మీదట ఇది ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నాం. ఆమె రాసిన లేఖ ఆధారంగా ఆత్మహత్యగా అనుమానించి కేసును దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భీమారావు తెలిపారు. 

Advertisement
Advertisement