వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide In Srikakulam - Sakshi

కట్నం వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

భర్తతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు

శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని పతివాడపాలెంలో గురువారం సాయంత్రం వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి కట్నం వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామానికి చెందిన ఉప్పల గురుమూర్తికి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెంపాడ గ్రామానికి చెందిన ధనలక్ష్మి(22)తో ఈ ఏడాది ఏప్రిల్‌ 18న వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు కావడంతో ఇరు కుటుంబాల మధ్య తగాదాలు జరిగేవి. ధనలక్ష్మి మూడు నెలల గర్భిణి కావడంతో దసరా పండగ సమయంలో కన్నవారింటికి వెళ్లింది.

అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. మూడు రోజుల కిందట(గత నెల 30వ తేదీ)  భర్త గురుమూర్తి నాన్నమ్మ చిట్టెమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మి అదే రోజు పతివాడపాలెం వచ్చి భర్త ఇంట్లోనే ఉంటోంది. ఇంతలో ఏమైందో గానీ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు హుటాహుటిన వచ్చి కన్నకూతురు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి వరకట్నం వేధింపులే కారణమంటూ తండ్రి ముత్యాల వెంకటరమణ జె.ఆర్‌.పురం పోలీసులు స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, సీఐ వి.రామకృష్ణ, తహసీల్దార్‌ కె.శ్రీరాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త గురుమూర్తి, అత్త పైడిరాజు, బావ అప్పలరాజు, మరిది మోహన్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top