నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide In Karimnagar | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

Jul 6 2018 8:47 AM | Updated on Jul 6 2018 8:47 AM

Married Woman Commits Suicide In Karimnagar - Sakshi

రోదిస్తున్న కుటుంబ సభ్యులు  రేణుక(ఫైల్‌)

మానకొండూర్‌: అత్తి వేధింపులకు మరో వివాహిత ప్రాణాలు విడిచింది. పెళ్లయి పుష్కరకాలం గడిచినా.. కట్నం వేధింపులు ఆ మహిళను వీడలేదు. మనస్తాపం చెందిన సదరు వివాహిత నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మానకొండూర్‌ మండలం ముంజంపల్లి గ్రామం లో గురువారం చోటు చేసుకుంది. సీఐ బిల్లా కోటేశ్వర్‌ వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండల కేంద్రానికి చెందిన మాచర్ల ఎల్లయ్య పెద్ద కూతురు రేణుక(32)ను తన సొంత అక్క అయిన మానకొండూర్‌ మండలం ముంజంపల్లి గ్రామాని కి చెందిన మొలుగూరి ఎల్లవ్వ కొడుకు గోపాల్‌కు ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఆ సమయంలో రూ. లక్షాపదివేల కట్నం, ఇతర లాంఛనాలు అందజేశారు. గోపాల్‌ కులవృత్తి చేస్తుండగా.. రేణుక వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కొద్దిరోజులు వీరికాపురం సజావుగానే సాగింది. వీరికి కుమారుడు జయంత్‌ జన్మించాడు. ఆ తరువాత మరో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు.
 
అదనపు కట్నం వేధింపులు.. 
కొద్దిరోజులకు ఇంట్లో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. మృతురాలి భర్త గోపాల్‌. అత్త ఎల్లవ్వ, మామ రాములు, ఆడపడుచు చెక్కిల్ల సరోజన గత ఐదేళ్లుగా కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు సైతం జరిగాయి. దీంతో తన బిడ్డ సంతోషంగా ఉండాలని మరో రూ. 50 వేలు సైతం మృతురాలి తండ్రి అందించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు.
 
మంచిగా సదువుకో కొడుకా.. అని.. 
గురువారం ఉదయం సైతం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త కులవృత్తికి వెళ్లగా.. అత్త బ్యాంకుకని వెళ్లింది. మామ బయటకు వెళ్లాడు. రేణుక తనకొడుకు జయంత్‌ను పాఠశాలకు సిద్ధంచేసి ‘కొడుకా.. మంచిగ సదువుకో’ అని సాగనంపింది. అనంతరం తలుపులు వేసుకుని కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. ఇంట్లోంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు తెరిచి చూడగా.. రేణుక మంటల్లో దహనమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో భర్త, అత్త, మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement