
మృతులు జయలక్ష్మి
ధర్మవరం అర్బన్/ ఉరవకొండ రూరల్: కుటుంబ కలహాలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వివాహితలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీలో నివాసముంటున్న చేనేత కార్మికుడు ధనుంజయ, జయలక్ష్మి (24) దంపతులు. భర్తకు చేదోడువాదోడుగా జయలక్ష్మి కూడా ఇంటి వద్దే ట్యూషన్ చెబుతుండేది. ఆదివారం కల్లూరు వద్దనున్న అమ్మవారి ఆలయానికి బంధువులతో కలిసి వెళ్లారు. అయితే తమ బంధువులను పిలవలేదని జయలక్ష్మి భర్తతో గొడవపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో బంధువులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సోమవారం సాయంత్రం భర్త కాలనీలోనే ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జయలక్ష్మి చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ట్యూషన్‌కు వచ్చిన పిల్లలు తలుపు తట్టినా ఎంతకూ తీయకపోవడంతో కాలనీవాసులకు తెలిపారు. వారు వెంటనే ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ధనుంజయ వచ్చి తలుపులు తీయగా జయలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆమిద్యాలలో మరొకరు..
ఉరవకొండ మండలం ఆమిద్యాలలో బెస్త కవిత (24) అనే వివాహిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అత్తమామల వేధింపులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఈమె ఇదివరకే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. పెద్దమనుషులు పంచాయితీ చేసి సర్దిచెప్పారు. సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులకు గడియపెట్టి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లోంచి పొగలు వస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి తలుపులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.