భీతిల్లుతున్న మన్యం

Maoists Killed Tribal Man in Visakhapatnam - Sakshi

ఇన్‌ఫార్మర్‌ నెపంతో మాజీ దళసభ్యుడి హత్య

ఇప్పటికి ముగ్గుర్ని హతమార్చిన మావోయిస్టులు

భయాందోళనల్లో గిరిజనం

గూడెంకొత్తవీధి(పాడేరు):మావోయిస్టు పార్టీలో 12 ఏళ్లపాటు  వివిధ స్థాయిల్లో పనిచేసి, చాలాకాలం అజ్ఞాతంలో గడిపాడు, అరెస్ట్‌ అయ్యి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి చివరకు వారి చేతుల్లో బలయ్యాడు.  జీకే వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలి లంబయ్య అలియాస్‌ దివుడును పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ పేరుతో మావోయిస్టులు హతమార్చడంతో ఏజెన్సీలో కలకలం రేగింది. ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో దివుడు మూడో వ్యక్తి. వరుస హత్యలతో ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌ఫార్మర్లుగా ముద్రపడిన వారు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరిని మావోయిస్టులు హత్య చేస్తారో తెలియక భీతిళ్లుతున్నారు.

సంఘటన స్థలం వద్ద లభ్యమైన తూటా  
ఉద్యమం కోసం పుష్కర కాలం శ్రమించి, ఇప్పుడు కుటుంబ సభ్యులతో జీవనం గడుపుతున్న లంబయ్య(48)ను హత్య చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల ఉద్యమంవైపు ఆకర్షితుడైన లంబయ్య ఆ పార్టీలో చేరి,వివిధ స్థాయిల్లో   పనిచేసి గాలికొండ దళ సభ్యునిగా ఎదిగాడు. సుమారు 12ఏళ్ల పాటు   దళంలో చురుగ్గా వ్యవహరించి అనేక సంఘటనల్లో పాల్గొన్నాడు. చాలా కాలం అజ్ఞాతంలో గడిపాడు. 2011లో చెరుకుంపాకల ఎదురుకాల్పుల ఘటనలో పోలీసులకు ఆయుధాలతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు లంబయ్యను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్ల పాటు విశాఖ కారాగారంలో శిక్ష అనుభవించి, 2013లో లంబయ్య బెయిల్‌పై విడుదలై గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బెయిల్‌పై వచ్చిన లంబయ్య తరచూ కోర్టు వాయిదాల నిమిత్తం విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు వెళ్లివస్తుండేవాడు. ఈ ఆరేళ్ల కాలంలో మన్యంలోని మావోయిస్టులకు పోలీసుల మధ్య  ఎదురుకాల్పులు, లొంగుబాటులు, అరెస్టుల వంటి సంఘటనలు జరిగాయి. జైలుకెళ్లివచ్చిన లంబ య్య, పోలీసులతో లోపాయికారిగా ఒప్పం దాలు కుదుర్చుకుని మావోయిస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడన్నది వారి అభియోగం. ఈ క్రమంలోనే పలు సంఘటనలకు బాధ్యుడిగా చేస్తూ మావోయిస్టులు లంబయ్యను మంగళవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపారు.   12ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన లంబయ్యను దారుణంగా కాల్చిచంప డంపట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహాన్ని డోలీలో తరలిస్తున్న బంధువులు
దిక్కెవరు...
లంబయ్యను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ నెపంతో హతమార్చడంతో అతని కుటుంబ సభ్యులు భోరున విలపించారు.   లంబయ్యకు భార్య జీమొ, కుమారులు రాంబాబు, దాసు, నాగేష్, మంగుడు, కుమార్తెలు సీతమ్మతో పాటు కోడలు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లంబయ్యను మావోయిస్టులు పొట్టనపెట్టుకోవడంతో తమకు దిక్కెవరంటూ వారు రోదించారు. పెదపాడు గ్రామంలో ఉంటున్న వీరంతా బుధవారం తెల్లవారు జామున సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. లంబయ్య హత్యతో పెదపాడు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.  

దుర్భర పరిస్థితుల మధ్య మృతదేహం తరలింపు  
మావోయిస్టుల చేతిలో హతమైన లంబయ్య మృతదేహాన్ని దుర్భర పరిస్థితుల మధ్య  పోస్టుమార్టం నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తరలించారు.  సంఘటన జరిగిన ప్రాంతం మండల కేంద్రానికి  ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.  కుంకుంపూడి సమీపంలో  ఉన్నప్పటికీ కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. భారీ వర్షం కారణంగా మృతదేహం తరలింపునకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీములబంధ వరకు లంబయ్య మృతదేహాన్ని డోలీలో తరలించి, అక్కడి నుంచి ఆటోలో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పెదపాడు గ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యుకులు, గ్రామస్తులు నరకయాతన పడ్డారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top