ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి

Maoists Killed Kidari Sarveswar Rao In AOB Visakhapatnam - Sakshi

1990లో బాలరాజు కిడ్నాప్‌..విడుదల

సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా చరిత్రలో మావోయిస్టులు శాసనసభ్యుడిని మట్టుబెట్టడం ఇదే ప్రథమం. ఆంధ్ర –ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో విశాఖ జిల్లా కూడా ఉంది. దీంతో వారి ప్రాబల్యం జిల్లాలో అధికంగానే కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానించిన వారిని దళసభ్యులు హతమారుస్తున్నారు. వీరిలో ఇన్‌ఫార్మర్ల నెపంతో కొందరిని, తమకు ప్రత్యర్థులుగా భావిస్తున్న పోలీసులు, మావోయిస్టులను, ప్రభుత్వానికి అనుకూలంగా, గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులను వీరు చంపుతున్నారు. 1990లో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు, ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, తదితరులను పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. జైలులో ఉన్న నక్సలైట్‌ నేత క్రాంతి రణదేవ్‌ను విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఈ కిడ్నాప్‌నకు అప్పట్లో పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల అనంతరం ప్రభుత్వం క్రాంతి రణదేవ్‌ను విడుదలతో నక్సలైట్లు బాలరాజు, తదితరులను విడిచిపెట్టారు. అప్పట్లో నక్సల్స్‌ చెరలో ఉన్న వీరందరినీ హతమారుస్తారని అంతా ఆందోళన చెందారు. తాజాగా ఇప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను  కాల్చి చంపారు. ఇలా ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడం విశాఖ చరిత్రలో ఇదే తొలిసారి!

కళ్లెదుట చంపేశారు..
ఎమ్మెల్యే కిడారి వద్ద కొంతకాలంగా పీఏగా పని చేస్తున్నాను.  ఆదివారం కండ్రుం పంచాయతీ సర్రాయిలో పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు అడ్డగించారు. వాహనంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్‌మేన్లు,  స్థానిక ప్రజాప్రతినిధులు, డ్రైవర్, నన్ను కిందకు దింపారు. ఎమ్మెల్యేతో మాట్లాడే పనుందంటూ కొంతదూరం తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలితే చంపేస్తామని తుపాకులు ఎక్కుపెట్టారు. కొంత సమయం తర్వాత అంతా చూస్తుండగానే ఎమ్మెల్యేను తుపాకితో కాల్చిచంపారు.– అప్పారావు, కిడారి పీఏ

ఎస్‌ఐ బాధ్యత రాహిత్యం వల్లే..టీడీపీ కార్యకర్తల ఆరోపణ
డుంబ్రిగుడ(అరకులోయ): తనిఖీల పేరిట అరకు రోడ్డులో హడావుడి చేసే డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మనరావు మండలం శాంతి భద్రతలను పట్టించుకోక పోవడం దారుణం అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.  ఎస్‌ఐ బాధ్యత రాహిత్యం వల్లే సంఘటన చోటుచేసుకుందన్నారు. డుంబ్రిగుడ పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐను  వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

అయ్యన్న దిగ్భ్రాంతి
నర్సీపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు దారుణంగా హత్య చేయటంపై రోడ్లు భవనాలశాఖ మంత్రి  చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు  సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కిడారి, సోమ హత్యలను ఖండించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఎప్పటికప్పుడు  సీఎంకు సమాచారం : కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఏజెన్సీ అంతటా అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. అలాగే భారీ స్థాయిలో భద్రతా బలగాలను ఏజెన్సీకి పంపించామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచారన్ని ఎప్పటికప్పుడు సీఎం, సీఎస్‌తో మాట్లాడుతున్నామని సమాచారాన్ని వాళ్లికి అందిస్తున్నామని తెలిపారు. కాల్పులపై విచారణ చేపట్టునున్నట్లు విలేకరులకు తెలిపారు.

కేడీపేటలో కొవ్వొత్తుల ర్యాలీ
గొలుగొండ(నర్సీపట్నం): మావోయిస్టుల చర్యకు నిరసనగా కొయ్యూరు సీఐ ఉదయకుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు కృష్ణదేవిపేటలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చట్టాలను చేతుల్లో తీసుకొని హింసకు పాల్పడుతున్న మావోయిస్టులకు తగిన గుణపాఠం తప్పదని సీఐ పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జీవో 97 వల్లే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీల్లో బాక్సైట్‌ తవ్వకాలు వీలు కల్పించే 97వ నంబరు జీవోను విడుదల చేయడం వల్లే మన్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య నేపథ్యంలో ఈ జీవో అంశం చర్చనీయాంశంగా మారింది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 97వ నంబరు జీవోను జారీ చేశారు. ఈ జీవో ద్వారా మన్యంలో లేటరైట్‌ పేరిట లోపాయకారీగా బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఈ జీవో రద్దు కోరుతూ గిరిజనులు, ప్రజా సంఘాలు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం కరువవడమే కాక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బలికావలసి వస్తోందన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top