కట్టుకున్నోడే కడతేర్చాడు

Man Killed Wife In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(తుని) : తుని మండలం టి.తిమ్మాపురం గ్రామంలో కట్టుకున్న భర్తే డబ్బుల కోసం తగాదా పడి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనలో పక్కుర్తి శివకుమారి(28) మృతి చెందగా, భర్త మహాలక్ష్మి పరారీలో ఉన్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ కె.కిషోర్‌బాబు, రూరల్‌ ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ పరిశీలించారు. రూరల్‌ సీఐ కిషోర్‌బాబు కథనం ప్రకారం.. టి.తిమ్మాపురానికి చెందిన పక్కుర్తి మహాలక్ష్మికి, కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం గ్రామానికి చెందిన శివకుమారితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఎనిమిది, ఐదేళ్ల వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి తాతయ్య వద్ద ఉంటుండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాలక్ష్మి వ్యవసాయ కూలి.

కొద్ది రోజులుగా శివకుమారి తునిలో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. ఇటీవల గొర్రెల లోను కోసం రూ.40వేలను లబ్ధిదారువాటాగా చెల్లించారు. ఆ లోను రాకపోవడంతో లబ్ధిదారు వాటాగా పెట్టిన డబ్బు మంగళవారం వెనక్కి ఇచ్చారు. ఆ డబ్బును పెద్దమ్మ వరుసైన ఆవాల సుబ్బలక్ష్మికి ఇవ్వడంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ బుధవారం తెల్లవారుజామున శివకుమారి హత్యకు దారితీసింది. శివకుమారిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్టు వివరించారు. మృతురాలి తండ్రి ఇసరపు త్రిమూర్తులు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ప్రమాదవశాత్తూ మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం 
నిందితుడు భార్య శివకుమారిని హత్య చేసి మృతదేహాన్ని నివాస గృహం ఎదుట ఉన్న రైల్వే పట్టాలపై ఉంచి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించాడన్నారు. బహిర్భూమికి వెళ్లగా మృత్యువాత పడిందనుకున్న స్థానికులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికులు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. మృతురాలి తల్లి దుబాయ్‌లో ఉంటుండగా తండ్రి, సోదరుడు సర్పవరంలో ఉంటున్నారు. వీరిద్దరూ వచ్చి అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్సై శివప్రసాద్, సీఐ కిశోర్‌బాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావులు హత్యగా నిర్ధారించారు. 

అనాథలైన చిన్నారులు : తల్లి శివకుమారి మృత్యుఒడికి చేరగా తండ్రి మహాలక్ష్మి పరారీలో ఉండడంతో వీరికి జన్మించిన ఇద్దరు చిన్నారులు అనాథులయ్యారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. భర్తకు చేదోడుగా ఉండేందుకు ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న శివకుమారి కొద్దిరోజులుగా తునిలో వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. అందరితో కలసిమెలసి ఉండే శివకుమారి మృతితో పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top