ఆస్తి కోసం తమ్ముడి హత్య

Man Killed His Younger Brother For Property In Warangal - Sakshi

కేసముద్రం : ఆస్తి కోసం ఆశపడి అనుబంధాన్ని మరిచిపోయిన ఉదంతమిది. తోడపుట్టిన బంధాన్నే మరిచాడు ఓ అన్న..తమ్ముడి అడ్డు తొలగిస్తే ఆస్తి తనదవుతుందని భావించాడు. దీనికి ఓ మిత్రుడు తోడయ్యాడు. దీంతో పథకం ప్రకారంగా ఆ ఇద్దరు కలిసి హత్యకు పాల్పడ్డారు. కేసు ఛేదించిన పోలీసులు ఆ ఇద్దరిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. మహబూబాబాద్‌ డీఎస్పీ నరేష్‌కుమార్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మహముద్‌పట్నం శివారు కాలనీతండాకు చెందిన వాంకుడోతు శ్రీనుకు ఇద్దరు కుమారులు సంతోష్, నవీన్‌లు ఉన్నారు.

వరంగల్‌లో నవీన్‌ ఇంటర్మీడియట్‌ చదువుతుండగా, సంతోష్‌ డిగ్రీ చదువుతున్నారు. ఈ క్రమంలో సంతోష్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అడుగగా  ఏమి ఆస్తి ఉంది.. ఉన్న 5 ఎకరాల్లో నీ తమ్ముడికి సగం పోతే నీకు ఏమీ వస్తుందని ప్రశ్నించింది. దీంతో తనకు పెళ్లి కావాలంటే ఆస్తి ఉండాలని ఆలోచించాడు. ఈ మేరకు రాఖీ పండుగకు అన్నదమ్ములు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన ప్రేమ వ్యవహరంతోపాటు, ఆస్తి విషయాన్ని ఇదే గ్రామంలో ఉంటున్న తన మిత్రుడు చిలువేరు సాయిరాంకు సంతోష్‌ తెలిపాడు. నీ తమ్ముడు అడ్డు తొలిగితేనే నీకు ఆస్తి వస్తుందంటూ అతడు చెప్పుకొచ్చాడు.

దీంతో ఇద్దరు కలిసి నవీన్‌కు చంపాలని పథకం పన్నారు. కాగా గత నెల 27న తన తమ్ముడితో మనం మందు పార్టీ చేసుకుందామని చెప్పాడు. వొడ్కా మందు ఫుల్‌బాటిల్‌ తెమ్మని కేసముద్రం స్టేషన్‌కు పంపించాడు. ఇంతలో సంతోష్‌ కేసముద్రం విలేజ్‌లో ఎలుకల మందును తీసుకువచ్చాడు. తర్వాత మహముద్‌పట్నం గ్రామంలో మూడు బీర్లు తీసుకు వచ్చారు. సంతోష్‌ తన వ్యవసాయబావి వద్దకు మిత్రుడితో కలిసి వెళ్లారు. అక్కడే ఒక బీరు మూత తీసి అందులో ఎలుకల మందును కలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన నవీన్‌కు ఎలుకలమందు కలిపిన బీరు తాగమని ఇవ్వడంతో అతడు అందరితో పాటు తాగాడు. సాయంత్రం వరకు మందు పార్టీ సాగింది.

ఈ క్రమంలో నవీన్‌ తన చొక్కాను విప్పి బండరాయి మీదకు వేసి పడుకున్నాడు.సాయంత్రమైనా నవీన్‌ ఊపిరితో ఉండడంతో, ఇతడు బతికితే తమ బండారం బయటపడుతుందని భావించి, విప్పిన చొక్కాను మెడకు కట్టి రెండువైపులా లాగి ఉరి వేసి హత్య చేశారు. సంతోష్‌ తన తమ్ముడి సెల్‌ఫోన్‌ను తీసుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన సంతోష్‌ను తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే ఏం సమాధానం చెప్పకపోవడంతో ఫోన్‌చేశారు. సంతోష్‌ వద్ద ఉన్న తమ్ముడి సెల్‌పోన్‌ రింగ్‌ కావడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగి నిలదీశారు. ఈ క్రమంలో సంతోష్, సాయిరాం ఇద్దరు పరారయ్యారు.

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని గుర్తించారు. పోలీసులు గాలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ ఇద్దరు ఎటూ వెళ్లలేక శుక్రవారం లొంగిపోయి, తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top