పోలీసుల అదుపులో నిందితుడు

Man Held in Fake Chitfund Company Guntur - Sakshi

చిట్‌ఫండ్‌ కంపెనీ పేరుతో రూ.కోట్లలో టోకరా

ఇటీవల పోలీసులను ఆశ్రయించిన రైతులు

మాచర్ల/రెంటచింతల/వెల్దుర్తి: తాను హైదరాబాద్‌లో చిట్‌ఫండ్‌ కంపెనీ పెట్టానని, ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే నెలవారీ వడ్డీ చెల్లించడంతో పాటు, భారీగా గిఫ్ట్‌లు కూడా ఇస్తానని ఓ యువకుడు మాచర్లలోని రైతులను మోసం చేశాడు. రూ.లక్షల నుంచి రూ.కోట్లలో నగదు వసూళ్లు చేసి హైదరాబాద్‌లో జల్సాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులు గడుస్తున్నా తాము చెల్లించిన సొమ్ముకు వడ్డీ రాకపోవడం, డబ్బు వసూలు చేసిన వ్యక్తి ఇదిగో.. అదిగో అంటూ మాయమాటలు చెబుతుండటంతో మాచర్ల నియోజకవర్గానికి చెందిన కొందరు రైతులు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డబ్బులు అడిగితే బెదిరింపులు
వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన యరగూటి బ్రహ్మానందరెడ్డి పదో తరగతి చదువుకున్నాడు. మాచర్లలో ప్లాస్టిక్‌ డ్రమ్ములు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. సుమారు ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన ఇతను అక్కడ చిట్‌ఫండ్‌ కంపెనీ ఏర్పాటు చేశానని ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే నెలకు మూడు రూపాయల చొప్పున వడ్డీ ఇవ్వడంతో పాటు గిఫ్ట్‌లు కూడా ఇస్తానని మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలు, దాచేపల్లి, సహా వివిధ ప్రాంతాల్లోని రైతులను నమ్మించాడు. వారి నుంచి గత మూడేళ్లుగా రూ.కోట్లలో వరకూ డబ్బు వసూళ్లు చేశాడు. వసూలు చేసిన డబ్బుకు నెల నెల వడ్డీ చెల్లించకపోవడం, తొలుత తాను ఇస్తానన్న గిఫ్ట్‌లు కూడా ఇవ్వకపోవడంతో రైతులు అతనిని గతేడాది నుంచి నిలదీస్తూ వస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి కాలం వెల్లదీస్తూ వచ్చాడు. డబ్బు చెల్లించకపోగా, డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగుతుండటంతో చేసేదేమీ లేక రైతులు రెంటచింతల పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top