టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

Man Died For Toll Billing Booth Collapses In East Godavari - Sakshi

సాక్షి, కిర్లంపూడి (తూర్పుగోదావరి) : జేసీబీలను తరలిస్తున్న ఓ లారీ కృష్ణవరం టోల్‌ ప్లాజా వద్ద బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొనడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒకరు మరణించారు. దాంతో మృతుని బంధువులు ధర్నా, రాస్తారోకో చేపట్టగా నాలుగు గంటలసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన ఉండ్రు రాజు (25) రెండేళ్లుగా కృష్ణవరం టోల్‌గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాజు ఆదివారం ఉదయం యథావిధి గా విధులు నిర్వహిస్తుండగా రాజమహేంద్రవరం నుంచి వైజాగ్‌ వైపు రెండు జేసీబీలను తరలిస్తున్న లారీ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొట్టింది. దాంతో బిల్లింగ్‌ బూత్‌ శ్లాబ్‌ కూలి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టోల్‌గేట్‌ సిబ్బంది రాజును ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రి తరలించారు.

అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనలో టోల్‌గేట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు, మాలమహానాడు, మాదిగ దండోరా నాయకులు, టోల్‌ సిబ్బంది టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారిపై భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ ఏబీజీ తిలక్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.  రాజు మృతికి టోల్‌గేట్‌ యాజమాన్యం కారణమని, ఆ యాజమాన్యమే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.

టోల్‌గేట్‌ యాజమాన్యం నష్టపరిహారంగా రూ. లక్ష చెల్లించేందుకు ముందుకు వచ్చింది.  రెండు రోజుల టోల్‌ఫీజు ఇవ్వాలని వారు పట్టుబట్టారు. పోలీసుల చొరవతో ఎట్టకేలకు టోల్‌గేట్‌ యాజమాన్యం రూ. 6 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో దళిత నాయకులు దానం లాజర్‌బాబు, కాపారపు రాజేంద్ర, శివ, అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. పెద్దాపురం సీఐ జి.శ్రీనివాస్, కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, ఏలేశ్వరం ఎస్సైలు జి.అప్పలరాజు, టి.రామకృష్ణ, తిరుపతిరావు, సుధాకర్, పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై జి.అప్పలరాజు కేసు నమోదు చేశారు.

వివాహమైన రెండు నెలలకే..
రాజుకు రెండు నెలల క్రితమే వివాహం అయ్యింది. రాజు మరణవార్త తెలుసుకున్నఅతని భార్య పావని, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తోటి సిబ్బంది సైతం రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top