ఘరానా మోసగాడు!

A Man Cheats Finance Company In East Godavari  - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(అన్నవరం) : బ్యాంకులో కుదువ పెట్టిన రూ.ఏడు లక్షల విలువైన బంగారాన్ని విడిపించుకోవడానికి రూ.2.20 లక్షలు సహాయం చేస్తే ఆ బంగారాన్ని తక్కువ ధరకు మీకే విక్రయిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి ఆ సొమ్ము తీసుకుని పరారైన ఘరానా మోసగాడి ఉదంతమిది. తొండంగి ఎస్సై గోపాలకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని గోపాలపట్నంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఇటీవల బ్యాంకులో ఖాతాదారులు విడిపించుకోని బంగారాన్ని వేలం వేస్తున్నట్టు పత్రికలో ప్రకటన ఇచ్చింది. అది చూసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కుమార్‌ అనే వ్యక్తి విజయవాడలోని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీకి ఫోన్‌ చేశాడు. ఆ కంపెనీ బ్యాంకు వేలం వేసే బంగారాన్ని పాడుకుని తిరిగి లాభాలకు విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఈనెల ఆరో తేదీన కుమార్‌ ఫోన్‌ చేసి గోపాలపట్నంలో గల స్టేట్‌బ్యాంక్‌ శాఖలో రూ.ఏడు లక్షల విలువ చేసే తన బంగారం సోమవారం వేలం వేస్తున్నారని, తన వద్ద రూ.ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన డబ్బు మీరు సర్దితే ఆ బంగారాన్ని విడిపించి వెంటనే మీకు అమ్ముతానని తెలిపాడు.

అది నిజమని నమ్మిన ఆ ఫైనాన్స్‌ కంపెనీ యజమాని రూ.2.20 లక్షలు తమ వద్ద పనిచేసే టి.సురేష్‌ అనే వ్యక్తికి ఇచ్చి సోమవారం ఉదయం ఆ బ్యాంక్‌కు పంపించారు. మరోవైపు కుమార్‌ సోమవారం ఉదయం అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్‌ దిగి, తాను ఆర్టీసీలో డీఎంనని అక్కడ క్యాంటీన్‌ నిర్వహిస్తున్న కర్రి లోవదొరను పరిచయం చేసుకున్నాడు. అర్జెంట్‌ గా స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లాలని కారు కావాలని అడిగాడు. దీంతో లోవదొర తన కారు ఇచ్చి తన బంధువుతో అతడిని బ్యాంకుకు పంపించాడు. ఆ బ్యాంకు వద్ద వేచి ఉన్న ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి సురేష్‌ వద్దకు వెళ్లి ఈ కారు తనదేనని చెప్పి బీఎం వద్దకు వెళ్లి మాట్లాడివస్తానని వెళ్లాడు. తరువాత కొంతసేపటికి వెనక్కి వచ్చి డబ్బు ఇవ్వండి బ్యాంకు మేనేజర్‌కు కట్టేస్తాను అని రూ.2.20 లక్షలు తీసుకుని మరలా బ్యాంక్‌ మేనేజర్‌ రూమ్‌లోకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెనక్కి వచ్చాడు. అర్జంటుగా బయటకు వెళ్లి ఒక సంతకం పెట్టాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతుండగా ఆ ఫైనాన్స్‌ ఉద్యోగి అతడిని నిలదీశాడు.

‘‘మా కారు ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తా’’ అని చెప్పి రోడ్డు మీదకు వెళ్లాడు. ఎంతసేపటికి అతడు రాకపోవడంతో ఆఫైనాన్స్‌ ఉద్యోగి బ్రాంచ్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లి గోల్డ్‌లోన్‌ వేలం గురించి, తన వద్ద డబ్బు చెల్లించాలని తీసుకున్న విషయం చెప్పాడు. అయితే తనను ఆ విషయాలు అతడు అడగలేదని, పర్సనల్‌ లోన్‌ కావాలని మాత్రమే అడిగాడని బీఎం చెప్పారు. దీంతో ఆ ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి సురేష్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకుకు వచ్చి సీసీటీవీ పుటేజీ పరిశీలించి ఆ మోసగాడి ఫొటో డౌన్‌లోడ్‌ చేశారు. ఈ మోసగాడిపై ఇప్పటికే ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో పదికి పైగా కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని పరిశీలనలో తేలిందని ఎస్సై  తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top