రుణం ఇవ్వడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

Mahabubabad Farmer Attempts Suicide For Not Giving Sanctioned Loan - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: తనకు మంజురైన రుణాన్ని బ్యాంకు అధికారులు ఇవ్వటం లేదని మనోవేదనకు గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు భార్య జాటోతు శాంతి, కుమారుడు సోలోమన్‌ తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలంలోని మర్రితండా జీపీ పరిధిలో గల  చెరువుముందు తండకు చెందిన జాటోతు శర్వణ్‌కు ప్రభుత్వం నుంచి రూ.1.30 లక్షల విలువ గల గొర్రెల రుణం మంజురైంది. ఇందుకు సంబంధించి డబ్బుల కోసమని శర్వణ్‌ మహబూబాబాద్‌ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో గల తన ఖాతాలో డబ్బులు జమచేయమని బ్యాంకు చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఏదో ఒక కారణం చూపుతూ అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. సోమవారం కూడా రోజుమాదిరిగానే డబ్బుల కోసం ఐఓబీకి వెళ్లి అధికారులను అడిగాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అదే బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top