మత్తు మందు ఇచ్చి నగల అపహరణ

lady thief gives drug and stolen jewellery  - Sakshi

దర్గాకు వచ్చిన మహిళలనుమోసగించిన కిలేడి   

వేనాడు(తడ): రైలులో ప్రయాణిస్తున్న మహిళలను మాయ మాటల్లో దించి, వారితో కలసి ప్రయాణించి అదనుచూసి చాకచక్యంగా నగలను దోచుకెళ్లిన ఘటన గురువారం రాత్రి వేనాడులో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు తడ మండలం ఇరకం గ్రామానికి చెందిన నైనా విజయమ్మ, నైనా ధనలక్ష్మి, నైనా సెల్వి కుటుంబాలు చాలా కాలం క్రితం తమిళనాడులోని పొన్నేరికి కాపురం వెళ్లిపోయారు. అమావాస్య సందర్భంగా వేనాడులో ఉన్న షేక్‌ దావూద్‌ షావలీ అల్లా దర్గాను దర్శించుకుని రాత్రికి అక్కడ నిద్ర చేసేందుకు ముగ్గురూ గురువారం వేనాడు గ్రామానికి రైలులో వచ్చారు. వీరికి పొన్నేరి వద్ద బురకా వేసుకున్న మహిళ రైలులో కలిసి మాటలు కలిపింది. ఆమె మాటలకు వీరు ముగ్గురూ బాగా ఆకర్షితులయ్యారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో దర్గా వద్ద అన్నదానం చేసి ముగ్గురు మహిళలకు చీరలు అందించాలని వెళుతున్నట్టు ఆమె వీరికి తెలిపారు.

ఇంతలో సూళ్లూరుపేటకు చేరుకున్న మహిళలను మీరు నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారంటూ మీకు చీరలు తీసిచ్చి మరో ఇద్దరు ఇతరులను చూసి మిగిలిన చీరలు ఇస్తానంటూ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి చీరలు కొనిచ్చింది. అనంతరం అందరూ వేనాడుకి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు తమతోపాటు తెచ్చుకున్న భోజనం తమకు పరిచయమైయ మహిళతో కలిసి తిన్నారు. అనంతరం ఆ మహిళ కూల్‌డ్రింక్‌ తెచ్చి వీరికి అందించింది. కూల్‌డ్రింక్‌ తాగిన కొంతసేపటికి వారు ముగ్గురూ నిద్రలోకి జారుకోగా విజయమ్మ మెడలోని తాళిబొట్టు, కాసులతోటు మరో బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. మిగిలిన ఇద్దరు మహిళలు తమ వస్తువులను దాచుకోవడంతో అవి భద్రంగా మిగిలాయి. ఉదయం లేచి చూసిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తడ ఎస్‌ఐ దాసరి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని మత్తు ప్రభావం తొలగని మహిళలను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top