ఏపీకి చెందిన ఎవరా మంత్రి!?

Jayaram murder case: Rakesh Reddy phone call to AP minister! - Sakshi

జయరాం హత్యకేసు నిందితుడి కాల్‌లిస్ట్‌లో రాష్ట్ర అమాత్యుడు

ఏపీ టీడీపీ నేతలతోనూ రాకేష్‌కు లింకులు

విచారణలో విస్తుగొలిపే నిజాలు

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రగతి రిసార్ట్స్‌ సీఎండీ ఫిర్యాదు 

సాక్షి, అమరావతి : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తులో తీగలాగితే పెద్దల డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితుడు రాకేష్‌ విచారణలో విస్తుగొలిపే నిజాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణాలోని పలువురు పోలీసుల మెడకు చుట్టుకున్న రాకేష్‌ వ్యవహారం తాజాగా ఏపీలోని టీడీపీ నేతలతో ఉన్న లింకులూ వెలుగుచూస్తున్నాయి. జయరాంను హత్య చేసిన తాను దాని నుంచి బయటపడేందుకు ఏపీలోని ఓ మంత్రి సహాయాన్ని పొందేందుకు ప్రయత్నించానని, అందుకు ఆ మంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం ఫోన్‌లో కోరినట్టు పోలీసు విచారణలో రాకేష్‌ వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఏపీకి చెందిన ఆ మంత్రి ఎవరన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి నందిగామలో జయరాం మృతదేహం కనుగొన్నప్పుడే టీడీపీ నేతలు కేసును రాకేష్‌రెడ్డి అరెస్టుకే పరిమితం చేసేలా కృష్ణాజిల్లా పోలీసులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. 

కేసు నుంచి బయటపడేందుకే మంత్రికి ఫోన్‌
జయరాం హత్యకేసులో తెలంగాణ టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాకేష్‌ కాల్‌లిస్ట్‌ను పోలీసులు పరిశీలించడంతో ఏపీ మంత్రి ఫోన్‌ నెంబర్‌కు మాట్లాడిన విషయం బయటపడింది. ఏపీ మంత్రికి ఎందుకు కాల్‌ చేశావని అడిగితే ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఏమైనా సహాయం చేయగలరేమో నేరుగా కలిసి మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగినట్టు రాకేష్‌రెడ్డి విచారణలో వెల్లడించినట్టు తేలింది. 

కాగా, రాకేష్‌రెడ్డి.. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నట్టు ఇటీవల ఫొటోలు చక్కర్లు కొట్టాయి. ఉన్నతస్థాయి పైరవీలకు అధికార టీడీపీ నేతల పరపతిని వాడుకున్నాడని కూడా తెలుస్తోంది. మరోవైపు.. నందిగామ పోలీసులు ఏ మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తారు? అన్న దానిపైనా పోలీసులు కన్నేశారు. నిందితుడికి ఎంత సాన్నిహిత్యం లేకుంటే ఆ మంత్రికి నేరుగా ఫోన్‌చేసి అపాయింట్‌మెంట్‌ అడుగుతాడనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాక, సెక్రటేరియేట్‌కు రా కలుద్దామని మంత్రి చెప్పారంటే వారి మధ్య పరిచయం ఎంత బలంగా ఉందో అన్న దానిపైనా విచారణాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

‘బెదిరించి ప్లాట్లు రాయించుకున్నాడు’ 
చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడైన రాకేష్‌ రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మరో క్రిమినల్‌ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ కాలనీకి చెందిన ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, ప్రగతి రిసార్ట్స్‌ చైర్మన్‌ జీబీకే రావు, అతని బావమరిది బాబూరావుకు మధ్య  బళ్లారిలోని ఫ్యాక్టరీకి సంబంధించి ఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  2017 డిసెంబర్‌లో రాకేష్‌ రెడ్డి, బాబూరావుతో పాటు మరికొందరు అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 1లోని ప్రగతి రిసార్ట్స్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు. రూ.7.50 కోట్లకు సంబంధించి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలంటూ లేనిపక్షంలో తన చేతులకు పనిచెప్పాల్సి ఉంటుందని రాకేష్‌ రెడ్డి జీబీకే రావును బెదిరించాడు. 

అంతేకాకుండా అతడి భార్యను కిడ్నాప్‌ చేసేందుకు పథకం పన్నిన రాకేష్‌ రెడ్డి ఆయన భార్యను గుర్తుపట్ట లేక ఓ మహిళా ఉద్యోగిని కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని గుర్తించి రెండు గంటల్లో వదిలేశారు. అనంతరం జిబీకే రావు కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. తనకు పోలీస్‌ ఉన్నతాధికారులు,  అధికార పార్టీ నేతలు, ఏపీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తాను ఏం చేసినా ఎవ్వరూ అడిగేవారు లేరని హెచ్చరించాడు. వారిముందే ఏపీకి చెందిన కొందరు మంత్రులు, సిటీలోని కొందరు పోలీస్‌ అధికారులతో మాట్లాడినట్లు నటించాడు. తనకు వారంతా అండగా ఉన్నారని విషయం సెటిల్‌ చేసుకోవాలని బెదిరించాడు. అంతేగాక చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌కు చెందిన 16వేల గజాల ప్లాట్లను తన పేరుపై రాయించుకోవడమేగాక జీబీకే రావు భార్య, కుమారుడి బెదిరించి వారితో బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. డబ్బులు ఇచ్చి పత్రాలు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. 

తాజాగా జయరామ్‌ హత్యకేసులో రాకేష్‌ రెడ్డిని విచారిస్తున్న  పోలీసులకు ఈ పత్రాలు లభ్యమయ్యాయి. సదరు ప్లాట్లను వేరొకరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయరామ్‌ హత్యకేసులో రాకేష్‌ రెడ్డి నిందితుడని తేలడంతో ఈ వ్యవహారంపై జీబీకే రావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాకేష్‌ రెడ్డి, బాబూరావు తదితరులు తమ కుటుంబ సభ్యులను  బెదిరించడమే కాకుండా ప్లాట్లకోసం సంతకం చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు రాకేష్‌ రెడ్డి బాబూరావు తదితరులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top