మా కొడుకునే ప్రేమిస్తావా!

Inter Student Suicide In Nellore - Sakshi

అనుమసముద్రంపేట(నెల్లూరు): విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని కావలియడవల్లి వడ్డెరపాళెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన వల్లెపు మస్తాన్‌ కుమార్తె వల్లెపు మమత (16) ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి రేణుకమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో మమతను అమ్మమ్మ గ్రామమైన ప్రకాశం జిల్లా చినపావనిలో ఉంచి 10వ తరగతి వరకు చదివించారు.

తర్వాత తండ్రి మస్తాన్‌ ఆమెను ఆత్మకూరులోని కళాశాలలో చేర్పించాడు. సమీపంలో ఉన్న ఓ బాలికల హాస్టల్‌లో ఉంటూ మమత చదువుకుంటోంది. రెండురోజుల క్రితం ఆరోగ్యం బాగోలేదంటూ ఇంటికి వచ్చింది. శనివారం యువతి ఇంట్లో ఒక్కటే ఉంది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన అంకమ్మ అనే మహిళ వచ్చి మమత తన కుమారుడిని ప్రేమిస్తోందంటూ తిట్టి వెళ్లింది. అదేరోజు మధ్యాహ్నం మస్తాన్‌ పొలం నుంచి ఇంటికి వచ్చాడు.

కుమార్తె కోసం చూసేసరికి బాత్‌రూంలో ఉరేసుకుని కనిపించింది. దీంతో అతను యువతిని కిందకు దించి సమీపంలోని ఆర్‌ఎంపీ డాక్టర్‌ని ఇంటికి తీసుకువచ్చి చూపించాడు. అప్పటికే ఆమె మృతిచెందిందని అతను చెప్పాడు. గ్రామస్తుల ద్వారా ఆదివారం ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top