దృష్టి మళ్లిస్తారు.. దోచేస్తారు | Inter State Thief Gangs Arrest In Anantapur | Sakshi
Sakshi News home page

దృష్టి మళ్లిస్తారు.. దోచేస్తారు

Aug 14 2018 1:43 PM | Updated on Aug 14 2018 1:43 PM

Inter State Thief Gangs Arrest In Anantapur - Sakshi

స్టేట్‌బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులను అభినందిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

అనంతపురం సెంట్రల్‌: ప్రజల దృష్టి మళ్లించి బ్యాగులు దొంగిలించే రెండు అంతర్‌రాష్ట్ర ముఠాలను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 32 లక్షలు విలువైన 1.040 కిలోల (కిలో నాలుగు తులాలు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్‌కుమార్‌ సోమవారం పోలీసుకాన్ఫరెన్స్‌ హాల్లో మీడియాకు వెల్లడించారు. అనంతపురం సీసీఎస్‌ఎస్‌ పోలీసులతో కలిసి కదిరి పోలీసులు, గుత్తి పోలీసులు వేర్వేరుగా వెళ్లి రెండు దొంగల ముఠాలను పట్టుకున్నారు. కదిరి పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో అనంతపురం రూరల్‌ మండలం పెద్దింటి గొల్ల రమేష్, ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఆవుల రత్నమ్మ, తుంకూరు జిల్లా ఉట్లగేరికి చెందిన బోవి గీత ఉన్నారు. వీరి నుంచి 64 తులాల బంగారు బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

గుత్తి పోలీసులు ధర్మవరం పట్టణం పోతుకుంటకు చెందిన దేవరకొండ వెంకటేష్, గిర్రాజు కాలనీకి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 38 తులాలను స్వాధీనం చేసుకన్నారు. ఈ రెండు ముఠాల్లోని ఆరుగు సభ్యులు సమీప బంధువులు. వీరిలో దర్శి సుబ్బరాయుడు, దర్శి ముత్యాలప్పలు స్వయాన అన్నదమ్ములు. వీరంతా కలిసి బ్యాగ్‌ లిఫ్టింగ్‌.. ద్యాస మళ్ళించి నేరాలకు పాల్పడడం వృత్తిగా ఎంచుకున్నారు. తోటి ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కడం, ప్రయాణికుల నుంచి పర్సులు, బ్యాగులు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. వీరంతా పాత నేరస్తులు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో వీరిపై కేసులున్నాయి. 2014లో త్రీటౌన్, తాడిపత్రి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ 10 కేసుల్లో వీరిని అరెస్ట్‌ చేశారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు ఇస్మాయిల్, కదిరి ఎస్‌ఐ హేమంత్‌కుమార్, గుత్తి ఎస్‌ఐ యువరాజు, వలీబాషు, సిబ్బందిని     ఎస్పీ అభినందించారు. 

స్టేట్‌ బ్యాంకు దోపిడీ కేసునుచేధించిన పోలీసులకు ఎస్పీ అభినందన
జిల్లాలో సంచలనం కలిగించిన జేఎన్‌టీయూ స్టేట్‌బ్యాంకు దోపిడీ కేసును రోజుల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ అభినందించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీరామ్, లేపాక్షి ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది రాంబాబు, గిరిబాబు, కుళ్లాయప్ప, షాకీర్, శివకుమార్‌ తదితరులను సత్కరించారు. బ్యాంకర్లు కూడా కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం వలన నేరాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం బ్యాంకులు మూసేస్తే మళ్లీ సోమవారం వెళ్లి చూసుకుంటారన్నారు. పర్యవేక్షణ లోపిస్తే దొంగలు నేరాలకు పాల్పడే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement