పీడీఎస్‌ బియ్యం వ్యాపారానికి అడ్డాగా పుట్టగూడెం

Illegal PDS Rice Business In Puttagudem Nalgonda - Sakshi

సాక్షి, రాజాపేట (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడెం తండా పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. గ్రామస్తులు నిత్యం ఆదే పనిగా వ్యాపారం కొనసాగిస్తూ టన్నుల కొద్దీ పీడీఎస్‌ బియ్యం సేకరించి నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వ్యాపారం మాత్రం ఆపడంలేదు. బియ్యం కొనుగోలులో బడా నాయకుల హస్తం ఉందని, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. 9 మే 2017న సిద్దిపేట జిల్లాకు తరలిస్తుండగా 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఓ వ్యాపారిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. కింది స్థాయి పోలీసుల కనుసన్నల్లో ఈ పీడీఎస్‌ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో సుమారు వెయ్యి మంది గిరిజనులు ఉంటారు. కాగా వీరికి ప్రధాన కులవృత్తి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి భూమిలో జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి, కంది వంటి పంటలు సేద్యం చేస్తారు. మిగతా కాలంలో ఖమ్మం, విజయవాడ వంటి జిల్లాలకు చెరుకు నరి కేందుకు ఎడ్లబండ్లపై వలస వెళ్తుంటారు. తిరిగి వచ్చే సమయంలో ఉప్పు కొనుగోలు చేసి ఇక్కడి ప్రజలకు విక్రయిస్తారు. కాగా మారుతున్న కాలనుగుణంగా వర్షాలు లేకపోవడంతో ఈ గ్రామంలో జీవనోపాధి కరువై కొందరు సారాయి విక్రయిస్తూ ఉపాధి పొందారు. ప్రభుత్వం సారా తయారీదారులు, విక్రయదారులపై కఠినచర్యలు తీసుకుంటూ పీడీ యాక్టు నమోదు చేయడంతో దానిని మానేశారు. దీంతో కొందరు గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలకు ఇటుక, కంకర, ఇసుక వంటి ముడిసరుకులు అందిస్తూ వ్యాపారులుగా మారారు.

కాగా కొంతమంది మాత్రం పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పీడీఎస్‌ బియ్యం సేకరిస్తూ గ్రామంలోని రహస్య ప్రాంతాల్లో నిల్వచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని సందర్భాల్లో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో దాడులుచేసి కేసులు నమోదు చేయగా భయపడిన కొందరు ఈ వ్యాపారాన్ని మానేయగా మరి కొందరు కొనసాగిస్తున్నారు.  ఈ గ్రామంలో మూడేళ్లుగా పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారం సాగుతూనే ఉంది. కాగా గ్రామంలోని గిరిజనులకు ఉపాధి కరువైందని, ప్రభుత్వాలు పని కల్పిం చాలని, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందివ్వాలని కోరుతున్నారు.

వ్యాపారం ఇలా...
గ్రామంలోని కొందరు తమ కుటుంబంతో కలిసి తెల్లవారుజామున నిత్యం ఆలేరు, జనగాం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో  కేజీకి రూ.10 ఇస్తూ పీడీఎస్‌ బియ్యం, నూకలను సేకరిస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తిరిగి మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి చేరుకుని గ్రామంలోని మరో రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని మూడు రోజులకు ఒకసారి రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కేసులు నమోదు
పుట్టగూడెం గ్రామంలో గత ఏడాది కాలంగా పోలీసులు ఐదు సార్లు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ 400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా  మూడు వాహనాలను పట్టుకొని 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ ఆంజనేయులు పేర్కొన్నారు.  

పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారణ
రాజాపేట : మండలంలోని పుట్టగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్‌ బియ్యం డంపులపై ఎస్‌ఓటీ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించిన సంగతి విధితమే. కాగా పీడీఎస్‌ డంపులు పట్టుకున్న సమయంలో ఎస్‌ఓటీ పోలీసులపై వ్యాపారులు దాడికి పాల్పడి పోలీసులను గాయపరిచిన సంఘటనపై భువనగిరి ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నర్సింహారావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఓటీ పోలీసులు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బరాజు, కానిస్టేబుల్‌ సురేందర్‌రెడ్డి సివిల్‌ డ్రెస్సుల్లో వెళ్లగా అక్రమ వ్యాపారులు రాళ్లతో దాడిచేయగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం వ్యాపారులు అక్కడున్న పల్సర్‌ ద్విచక్రవాహనాన్ని, కొంత పీడీఎస్‌ డంపు నిల్వను దహనం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 35 టన్నులు (350) క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ వ్యాపారులు మాడోతు చంటి, శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేసినట్లు ఏఎస్‌ఐ సీతారామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి, ఆలేరు ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top