ఎస్‌ఐనంటూ యువతికి వల..!

Home guard for impersonating SI, cheating woman in guntur - Sakshi

 మాయమాటలు చెప్పి యువతిని ప్రేమలోకి దింపిన హోంగార్డు  

 ఆమె తల్లి నుంచి రూ.12 లక్షలు వసూలు

 పెళ్లి గురించి ఒత్తిడి తేవడంతో వేరొకరితో సంబంధాలు అంటగడుతూ నిందలు 

 ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

 న్యాయం చేయాలంటూ రూరల్‌ ఎస్పీని ఆశ్రయించిన బాధితులు 

సాక్షి, గుంటూరు: విజిలెన్స్‌ ఎస్‌ఐనంటూ యువతిని ప్రేమలోకి దింపి మోసగించిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న గన్‌మెన్‌ల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని యువతికి పంపి ప్రేమలోకి దించాడు. తర్వాత ఆమె తల్లి వద్ద రూ.12.50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపైనే నిందలు వేసి నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లి మంగళవారం గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. 

నరసరావుపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్‌ ఫేస్‌బుక్‌లో రిక్వెస్టులు పెట్టి పరిచయమై తాను విజిలెన్స్‌ ఎస్‌ఐనంటూ తుపాకీ పట్టుకున్న ఫొటోను, ఓ నకిలీ ఐడీని యువతికి పంపాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతను ఎస్‌ఐ అని నమ్మిన యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు. బ్యాంకు లోను కింద రూ.15లక్షలు కట్టాల్సి ఉందని, డబ్బు ఇవ్వాలని కోరాడు. వారు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు. కొంతకాలం తరువాత పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపణలు చేశాడు. 

తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ డబ్బు అయినా ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సింది రూ.6 లక్షలే అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనిల్‌ ప్రవర్తన తో తన బిడ్డ జీవితం నాశనమైందని, పోలీసులు  న్యాయం చేయాలని వేడుకుంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top