కుటుంబ కలహాలతో హోంగార్డ్‌ ఆత్మహత్య

Home Guard Commits  Suicide With Family Issues In Visakhapatnam - Sakshi

సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : కుటుంబ కలహాలతో ఓ హోంగార్డ్‌ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సూర్యాభాగ్‌లోని నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమీపంలో ఉన్న వైశాఖి జల ఉద్యానవనం వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2012లో హోంగార్డ్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించిన గంటా ప్రకాశరావు(40) గుంటూరు ప్రాంతవాసి. పీఎం పాలెం పోలీసు స్టేషన్‌లో కొనేళ్లుగా పోలీసు రక్షక్‌ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రకాశ్‌కు పదేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక(30)తో  వివాహమైంది. ఉద్యోగం, ఇతర కారణాలు రీత్యా ఎండాడ వరాహగిరి నగరంలో స్థిర పడ్డారు. ఇక్కడి జీ ప్లస్‌2 భవనంలోని పైఫ్లోర్‌లో ప్రకాశ్‌ భార్య, పిల్లలు ఆశ్రిత్‌(6), అఖిల్‌(4)తో నివాసం ఉంటున్నాడు. అదే భవనం కింది ఫ్లోర్‌లో ఆయన తండ్రి మరియదాసు, తల్లి విజయకుమారి నివాసం ఉంటున్నారు. తండ్రి సీబీసీఐడీలో ఎస్‌ఐగా పనిచేసి రిటైరయ్యారు. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ గొడవలు పడుతుండేవారు. కొన్నాళ్ల కిత్రం భార్య ప్రకాష్‌పై గృహ హింస వేధింపుల(498) కేసు పెట్టింది. తర్వాత లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ అయ్యారు. 

కలహాలు పెంచిన ఫేస్‌బుక్‌ పోస్టు
గొడవలు జరుగుతుండగానే గత నెల 14న తనను వేధింపులకు గురిచేసి కొడుతున్నట్టు భార్య ప్రియాంక ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టినట్టు సమాచారం. తర్వాత పీఎం పాలెం పోలీసు స్టేషన్‌లో కూడా ఆమె మౌఖిక ఫిర్యాదు ఇవ్వగా.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే అప్పటికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా గత నెల 16న ప్రియాంక, ఆమె తల్లిదండ్రులు, మరో వ్యక్తి కలిసి తనను తీవ్రంగా కొట్టారని, ఎంఎల్‌సీ చేయించుకుని పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో ప్రకాశ్‌ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రియాంక సూర్యభాగ్‌లోని డీసీపీ–1కి ప్రకాష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్‌ను పిలిపించారు. ‘నీ భార్య ఫిర్యాదు ఇచ్చింది. పోలీసు కార్యాలయంలోనే కూర్చోవాలని’ చెప్పారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి 9.25 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో మృతి చెందాడు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు స్పందిస్తే ఓ నిండు ప్రాణం దక్కేది!
ప్రకాశ్‌ చనిపోవడానికి ముందే వాట్సప్‌లలో మరణ వాగ్మూలాన్ని పోస్ట్‌ చేశాడు. దీన్ని అందరితో పాటు పోలీసులు కూడా తేలిగ్గా తీసుకున్నారు. సకాలంలో స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని పలువురు అంటున్నారు.

నమ్మండి.. నమ్మకపోండి.. ఇక బై
ప్రకాశ్‌ పీఎంపాలెం పోలీసు స్టేషన్‌లో రక్షక్‌ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పోలీసు రిటైర్డ్‌ ఎస్‌ఐ, సోదరి పోలీసు కానిస్టేబుల్‌. మొత్తంగా వీరిది పోలీసు కుటుంబం. చీటికి మాటికీ భార్య గొడవ పడుతూ పోలీసు స్టేషన్‌కి, కోర్టుకి లాగుతుండంతో భరించలేకపోయాడు. దీంతో సెల్‌ఫోన్‌ వీడియో చిత్రీకరించి వాట్సప్‌లలో పోస్ట్‌ చేశాడు. ఆయన మాటల్లోనే..

‘నమస్కారం సార్‌.. నా పేరు గంటా ప్రకాశరావు, హెచ్‌జీ 457, పీఎంపాలెం రక్షక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. మా ఆవిడతో కొంత కాలంగా నాకు గొడవలు అవుతున్నాయి. సర్దుకుపోతున్నా ఆమె వినడం లేదు. తరచూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. ఇటీవల 498ఏ కేసు కూడా పెట్టింది. మళ్లీ లోక్‌ అదాలత్‌లో ఆమె రాజీకొచ్చింది. మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వడం లేదు. ఇటీవల తాను వేధించి, కొట్టేశానని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది. ఆమె కుటుంబ సభ్యులతో కూడా నన్ను కొట్టించింది. దీనిపై ఫిర్యాదు చేస్తే కనీసం గంట కూడా స్టేషన్‌లో ఉంచకుండా వారిని పంపించేశారు. అదే మా ఆవిడ డీసీపీ–1కు ఫిర్యాదు చేస్తే నన్ను స్టేషన్‌కు పిలిచి, విచారించారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. దీంతో మనస్తాపంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. సర్‌ ఇదే నా చివరి మరణ వాంగ్మూలం. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇక బై’. అంటూ ప్రకాశ్‌ పెట్టిన సెల్ఫీవీడియో వైరల్‌ అవుతోంది..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top