ఎన్నికల వేళ భారీగా ‘హవాలా’ డబ్బు పట్టివేత | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ భారీగా ‘హవాలా’ డబ్బు పట్టివేత

Published Wed, Mar 13 2019 1:28 AM

Heavily hawala money Captured - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌ నగర పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రూ.90,50,400 హవాలా డబ్బు పట్టుబడింది. కంచన్‌బాగ్, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో నాలుగు బైక్‌లపై అక్రమంగా డబ్బు రవాణా చేస్తున్న నలుగురిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల వివరాలను మంగళవారం ఇక్కడ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, దీంతో రోజులో 24 గంటలూ నగర పోలీసులు అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ మేరకు ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కాచిగూడ, సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో బర్కత్‌పురా లో నివాసముండే గుజరాత్‌కు చెందిన దేవేష్‌ కొథారి వద్ద రూ.50 లక్షలు, కాచిగూడలో నివాసముండే గుజరాత్‌వాసి భక్తి ప్రజాపతి వద్ద రూ.23 లక్షలు, ఎర్రగడ్డలో నివాసముండే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాన్‌ బిలాల్‌ నసీమ్‌ వద్ద రూ.7,70,400, గోషామహల్‌ వాసి విశాల్‌ జైన్‌ వద్ద రూ.11.80 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కోథారి వద్ద పట్టు కున్న రూ.50 లక్షల డబ్బు కోటులో దొరికింది. ఈ కోటులో కనీసం రూ.కోటి దాచే వీలుందని, ప్రత్యేకంగా అక్రమ పద్ధతిలో డబ్బులను రవాణా చేసేవిధంగా ఈ కోటు కుట్టించారని వివరించారు. ఈ నలుగురి నుంచి 3 క్యాష్‌కౌంటింగ్‌ యంత్రాలు, 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం లో స్పష్టత ఇవ్వకపోవడంతో నలుగురిని, పట్టుబడ్డ నగదును, ఇతర వస్తువులను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు అంజనీకుమార్‌ వెల్లడించారు.  

రూ.50 వేలకు మించితే రసీదులు చూపాలి  
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ప్రజలు ఎవరైనా రూ. 50 వేల కంటే ఎక్కువగా తమతో తీసుకెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఆ డబ్బుకు సంబంధించిన రసీదులను దగ్గర ఉంచుకోవాలి. తనిఖీల్లో పోలీసులకు సరైన పత్రాలు చూపించకపోతే వాటిని స్వాధీనం చేసుకొని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తారని కమిషనర్‌ తెలిపారు.హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలతోపాటు మల్కాజిగిరికి సంబంధించిన ఒక అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్నాయని, మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 45 తనిఖీ బృందాలను రంగంలోకి దింపామన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 195 కేసుల్లో లెక్కల్లో చూపని రూ.29 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి పట్టుబడిందని గుర్తు చేశారు.

ఈ 195 కేసుల్లో 120 చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని. 17 కేసుల్లో తీర్పులు కూడా వచ్చాయని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా రిటర్నింగ్‌ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. డబ్బు అక్రమ రవాణాలో ఎక్కువగా హవాలా దందా జరుగుతున్నట్లు తెలుస్తుందని, ఈ విషయాలన్ని ఆదాయపన్ను శాఖ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వస్తాయన్నారు. పట్టుబడ్డ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది... ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాలు ఆదాయపన్ను శాఖ విచారణలో తెలుస్తాయని చెప్పారు. సమావేశంలో ఎస్‌బీ జాయింట్‌ సీపీ తరుణ్‌జోషి, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చైతన్యకుమార్, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement