ముగ్గురినీ హతమార్చాడు

Hajipur Murder Accused Srinivas Reddy Murder Three Girls - Sakshi

గ్రామస్తులపై ప్రతీకారంతో అత్యాచారాలు, హత్యలు

సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డే.. శ్రావణి, మనీషాతో పాటు కల్పననూ కడతేర్చాడు

ఈవ్‌టీజింగ్‌ చేశాడని గ్రామస్తులు కొట్టడంతోనే ఉన్మాద చర్య

మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌

గ్రామంలోని యువతులు, మహిళల రాకపోకలపై రెక్కీ

లిప్టు పేరుతో తీసుకెళ్లి దాడి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం

కల్పన అస్థికలు లభ్యం.. హాజీపూర్‌ ఘటనలో విస్తుపోయే నిజాలు

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన హాజీపూర్‌ హత్యల కేసులో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. 2015లో కల్పన హత్యను చేసిందీ శ్రీనివాస్‌ రెడ్డేనని పోలీసులు స్పష్టం చేశారు. శ్రావణి, మనీషాతో పాటు కల్పననూ తానే హత్య చేశానని శ్రీనివాస్‌ రెడ్డి  అంగీకరించాడని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. దీంతో కల్పన కేసులో చిక్కు ముడి వీడినట్లయింది. గ్రామస్తులపై ప్రతీకారం కోసమే కామాంధుడు, సీరియల్‌ కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. మైనర్‌ బాలికలే లక్ష్యంగా క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చాడని సీపీ తెలిపారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలు, మహిళల కదలికలపై శ్రీనివాస్‌ రెడ్డి రెక్కీ నిర్వహించేవాడని.. వారిని అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసిన తర్వాతే అత్యాచారం చేసి చంపేసేవాడని వెల్లడైంది. కాగా.. బంధువుల ఇంట్లో దాక్కున్న సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని స్పెషల్‌పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లు, లిఫ్ట్‌ రిపేరు టూల్‌కిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్‌ ఘటన వివరాలను మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. వివరాలు.. సీపీ మాటల్లోనే..
 
2015 నాటి ఘటనలో..
2015లో బొమ్మల రామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని కల్పన (11) స్కూలు తర్వాత తన ఊరికి వెళ్తుండగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను హతమార్చి గన్నీబ్యాగ్‌లో మృతదేహాన్ని పెట్టి సీతారామ్‌రెడ్డి వ్యవసాయ బావిలో పడేశాడు. దీనిపై బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. ఈ ఘటనలోనూ శ్రీనివాస్‌రెడ్డిపైనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవు. అయితే శ్రావణి, మనీషాల హత్య కేసు విచారణ సందర్భంగా కల్పనను కూడా హతమార్చింది తానేనని శ్రీనివాస్‌ రెడ్డి.. అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి9న కీసర మండలం చీర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హాజీపూర్‌కు చెందిన విద్యార్థిని మనీషా (17) కళాశాల నుంచి ఇంటికొచ్చే క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై లిఫ్ట్‌ పేరుతో ఎక్కించుకొని బావి వద్దకు తీసుకువెళ్లి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసి అత్యాచారం చేసి, అంతమొందించాడు. తరువాత మృతదేహాన్ని తన బావిలో పూడ్చిపెట్టాడు. అప్పట్లో స్థానిక పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈనెల 29వ తేదీన శ్రావణి హత్యకేసు విచారణ సందర్భంగా.. బావి వద్ద దుర్వాసన వచ్చింది. ఘటనాస్థలంలో దొరికిన ఆధార్‌కార్డు. అక్కడ లభించిన మృతదేహాం (ఎముకలు) ఆధారంగా ఆమెను మనీషాగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేలింది.
 
చితకబాదిన గ్రామస్తులపై కోపంతో..
హాజీపూర్‌ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి (28) సెల్‌ఫోన్లో అసభ్యకర చిత్రాలను చూడటంతోపాటు మద్యం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. 2015లో మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బొమ్మల రామారం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డికి దేహశుద్ధి చేశారు. తనను చితకబాదిన గ్రామస్తులపై ఆయన పగ పెంచుకున్నాడు. మైనర్‌ బాలికలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారం చేస్తూ హతమార్చాలని నిర్ణయించుకుని ఉన్మాదిగా మారాడు. హాజీపూర్‌ గ్రామం ప్రారంభంలోనే తన ఇల్లుండడంతో.. బయటకు వెళ్లే బాలికలు, మహిళల రాకపోకలు గమనిస్తుండేవాడు.
 
శ్రావణి ఘటనతో దారుణాలు వెలుగులోకి
ఈనెల 25న 9వ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి (14) పాఠశాల నుంచి వచ్చి.. హాజీపూర్‌ వెళ్లేందుకు చెట్టుకింద బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్‌ రెడ్డి లిఫ్ట్‌ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై కొట్టి అపసార్మక స్థితికి వెళ్లిన తరువాత బావిలో పడేశాడు. తరువాత శ్రీనివాస్‌రెడ్డి బావిలోకి దిగి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అంతమొందించాడు. బావి నుంచి తిరిగివచ్చే క్రమంలో శ్రావణి స్కూల్‌బ్యాగ్‌ కనబడడంతో అనుమానం రాకుండా బ్యాగ్‌ను వ్యవసాయ బావి వద్ద పడేసి వెళ్లిపోయాడు. శ్రావణి హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఈనెల 26వ తేదీన భువనగిరిలో స్నేహితుని పెళ్లికి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యాడు.
 
పోలీసుల రాకతో పారిపోయాడు

ఏప్రిల్‌ 26న పోలీసుల ప్రత్యేక బృందం హాజీపూర్‌ గ్రామానికి చేరుకొని బాలిక అదృశ్యం కేసుపై విచారణ చేస్తున్నట్టు గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి ఊరొదిలి పారిపోయాడు. విచారణలో భాగంగా వ్యవసాయ బావి వద్ద స్కూల్‌ బ్యాగ్, స్కూల్‌ ఐడీ కార్డు లభించడంతో శ్రావణి అదృశ్యం మిస్టరీ వీడింది. అత్యాచారం చేసి, హత్య చేశారని విచారణలో తేలడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతంగా చేశారు. గ్రామంలో గంజాయి, మద్యం సేవించే వారిని విచారించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది. ప్రత్యేక పోలీసు బృందాలు, భువనగిరి పోలీసులు, బోమ్మల రామారం పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఘట్‌కేసర్‌ సమీపంలోని రావిరాల గ్రామంలోని బంధువుల ఇంట్లో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా శ్రావణి, మనీషాల హత్యపై నోరువిప్పిన శ్రీనివాస్‌ రెడ్డి ఆ తర్వాత కల్పనను చంపిన విషయాన్నీ వెల్లడించాడు.
 
అంతా సింగిల్‌గానే చేశాడు

బాలికల సీరియల్‌ అత్యాచారాలు, హత్యలు శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడే చేశాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. గతంలో శ్రీనివాస్‌రెడ్డి పని చేసిన ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మనీషా, కల్పనల ఎముకలు మాత్రమే లభించడంతో వీటిని డీఎన్‌ఏ ద్వారా నిర్ధారించుకుంటామని పోలీసులు వెల్లడించారు. కల్పన మిస్సింగ్‌ సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలనూ విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌లో శ్రీనివాస్‌రెడ్డికి వేములవాడకు చెందిన యువతితో వివాహాం జరిగినట్టు తెలియడంతో దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. ‘శ్రావణి తండ్రికి ప్రభుత్వోద్యోగం కోసం కలెక్టర్‌ పరిశీలిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయంపైనా ప్రభుత్వంతో కలెక్టర్‌ మాట్లాడుతున్నారు. గ్రామంలో గంజాయి విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. బెల్టుషాపులను మూసివేయించాం. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి జీవిత ఖైదు పడేలా కేసులు నమోదు చేస్తాం’అని సీపీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top