గుట్కా గుట్టుగా..

Gutka Smuggling in Guntur - Sakshi

చెన్నై, బెంగళూరుల నుంచి గుట్కా దిగుమతి

ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు పార్శిల్‌ సర్వీసుల ద్వారా రవాణా

జిల్లాలో రహస్య స్థావరాల్లో భద్రపరుస్తున్న అక్రమార్కులు

బైక్‌లపై దుకాణాలకు సరఫరా చేస్తున్న వైనం

సహకరిస్తున్న క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది

మారుమూల పల్లెల్లోని పాన్‌ షాపులో అడిగినా, పట్టణ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాల్లో సైగ చేసినా చాలు.. వెంటనే గుట్కా ప్యాకెట్‌ ప్రత్యక్షమవుతోంది. రెట్టింపు ధరతో వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ.. ఆరోగ్యానికి తూట్లు పొడుస్తోంది. అమలుకు నోచుకోని గుట్కాపై నిషేధం.. అధికారుల అలసత్వాన్ని నిలదీస్తోంది. సరిహద్దులు దాటుకుంటూ ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా జిల్లాలోకి ప్రవేశిస్తున్న గుట్కా.. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.

సాక్షి, గుంటూరు: జిల్లాలో యధేచ్ఛగా నిషేధిత గుట్కాలు లభ్యమవుతున్నాయి. నిషేధం మాటున కొందరు గుట్కా వ్యాపారులు రూ. కోట్లు పోగేసుకుంటున్నారు. ఇటు పోలీసులు, అటు విజిలెన్స్‌ అధికారులు నిఘా ఎక్కువవ్వడంతో వ్యాపారులు కొత్త పంథాల్లో గుట్కా రవాణా చేస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, తెనాలి సహా వివిధ ప్రాంతాలకు కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, హుబ్లీ, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి గుట్కా రవాణా సాగుతోంది. ఆయా నగరాల నుంచి హోల్‌సేల్‌గా నిషేధిత గుట్కా తెప్పించి గుట్టుగా జిల్లాలోని సిగరెట్, కిల్లి, చిల్లర కొట్లకు రీటైల్‌గా విక్రయిస్తున్నారు.

పార్సిల్‌ సర్వీస్‌ల ద్వారా...
రైల్వే, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థల ద్వారా రకరకాల పద్ధతుల్లో జిల్లాకు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి గుట్కా రవాణా చేస్తున్నారు. చిన్న చిన్న బస్తాలుగా చేసి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో గుంటూరుకు చేరుకునే  రైళ్లలోనే ఎక్కువగా గుట్కా పార్సిల్‌ చేస్తుంటారు. పగటి వేళల్లో రైల్వే కూలీలను మేనేజ్‌ చేసుకుని వాటిని పొద్దు పోయే వరకూ అక్కడే ఉంచుతున్నారు. ఈ తరహాలో రైల్వే పార్సిల్‌ ద్వారా వచ్చిన తంబాకును రవాణా చేస్తున్న వ్యక్తులను గుంటూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో గత జూలైలో కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పార్సిల్‌లో వచ్చిన నిషేధిత గుట్కాలను రహస్య స్థావరాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి బైకులపై షాపులకు రవాణా చేస్తున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ప్రాంతాల్లో టీడీపీ నాయకులు గుట్కా దందా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి గుట్కాలను షాపులకు కార్లు, బైక్‌లు, అశోక్‌ లైలాండ్, అప్పి ఆటోల్లో గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.  గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఎన్‌హెచ్‌ 66 పక్కన ఉన్న ఏటుకూరు రోడ్డు, నల్లచెరువు, కాకాని, నగరాలు సహా పలు ప్రాంతాల్లోని గోడౌన్‌లలో రాత్రికి రాత్రికి రహస్యంగా ఎంసీ, ఖలేజా వంటి గుట్కా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు సమాచారం. డిమాండ్‌ను బట్టి అప్పటికప్పుడు తయారు చేసి సరుకును బయటికి పంపి మిషన్‌లను విడదీసి భద్రపరుస్తున్నట్టు తెలుస్తోంది.

తెలిసినా గప్‌చుప్‌
గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్‌ సిబ్బందికి పూర్తి స్థాయిలో సమాచారం ఉంటోంది. అయితే ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియనివ్వకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. తెనాలి, నరసరావుపేట, గుంటూరు సహా పలు సబ్‌ డివిజన్‌లలో నడుస్తున్న గుట్కా దందాలో కింది స్థాయి పోలీస్‌ సిబ్బందికి హస్తం ఉన్నట్టు పోలీస్‌ వర్గాల్లోనే చర్చలు నడుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top