
లాక్‌డౌన్ సందర్భంగా విజయవాడలోని రామవరప్పాడు వద్ద ట్రాఫిక్ తీరును పరిశీలిస్తున్న డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు కేసులు తప్పవని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతంలో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. కరోనా వైరస్ బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలంతా సహకరించాలన్నారు.
మనందరి కోసం ఇలా..
- చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని గుర్తించి ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి.
- విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని పోలీసులు, వైద్యులు, రెవెన్యూ అధికారులకు చెప్పి తీరాల్సిందే. రహస్యంగా ఉంచితే కేసులు పెట్టి, పాస్‌పోర్టులు సీజ్ చేస్తాం.
- అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలి. అప్పుడు కూడా కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి. అవసరం లేకున్నా బయటకు వస్తే కేసులు పెట్టి, వాహనాలు సీజ్ చేస్తాం. ఇలా ఇప్పటి వరకు 2,300 కేసులు పెట్టాం. మంగళవారం ఒక్క రోజే 330 కేసులు నమోదు చేశాం.
- నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. ఉదయం 6 గంటల నుంచి 8 వరకు పాలు, కూరగాయలు వంటివి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నాం. అవసరాన్ని బట్టి వేళలు సడలిస్తాం. రాష్ట్రమంతటా ఒకే వేళల్లో నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా ఒక పద్దతి పెట్టాలని భావిస్తున్నాం.
- ఏ ఇబ్బంది వచ్చినా కోవిడ్ –19 కంట్రోల్ రూమ్, 104కు కాల్ చేయాలని సూచించాం. డయల్ 100ను కూడా ఉపయోగించుకుంటున్నారు.
జిల్లాల్లో రాకపోకలు బంద్: డీజీపీ
రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను రాకపోకలు నిలిపివేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ ప్రమాదం తీవ్రంగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను బయట తిరిగేందుకు అనుమతించబోమన్నారు. జనతా కర్ఫ్యూకు బాగా సహకరించిన ప్రజలు సోమవారం రోడ్లపైకి రావడం ప్రమాదభరితంగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం పోలీసు ఆంక్షలు కఠినతరం చేయడంతో ప్రజలు అత్యధికశాతం ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పారు. కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జర్నలిస్టులకు నిబంధనలు సడలించి అనుమతిస్తామన్నారు. అయితే వారంతా విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నప్పుడు గుర్తింపు కార్డు వెంట తీసుకుని వెళ్లాలని డీజీపీ చెప్పారు.