
బంగారం దొంగిలించిన దొంగలను చూపుతున్న ఎస్పీ విశాల్ గున్ని, సీసీఎస్ డీఎస్పీ పల్లపురాజు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్‌లోని ద్రావకం కొట్టులో బంగారం ముద్దల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.24 లక్షల విలువైన 743 గ్రాముల బంగారు బిస్కెట్‌ల ముద్దలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా, విఠ మండలం, కార్వి గ్రామానికి చెందిన ప్రశాంత్‌జాదవ్, సుశాంత్‌జాదవ్‌లు అన్నదమ్ముల పిల్లలు. వీరు ఇరువురు బంగారం ద్రావకం షాపులో పనిచేస్తుంటారు. సుశాంత్‌జాదవ్ గతంలో ఢిల్లీలో పని చేశాడు. ప్రశాంత్‌జాదెవ్ పెదనాన్న కొడుకు సతీష్‌జాదవ్‌కు కాకినాడ గోల్డ్ మార్కెట్‌లో ద్రావకం కొట్టు ఉంది. ఈ షాపులో దాదాపు ఏడేళ్లుగా వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం పనిని మానేసి తన స్వగ్రామం వెళ్లిపోయాడు. మరలా తిరిగి ఈ సంవత్సరం సెప్టెంబర్ 2018లో కాకినాడకు వచ్చి తిరిగి పనిలో చేరాడు.
సతీష్‌జాదవ్ షాపులో కొన్నిరోజులు పనిచేసి గొడవపడి వినాయక చవితి రోజు తన స్వగ్రామమైన కార్వి గ్రామం వెళ్లిపోయాడు. తిరిగి ఈనెల 9వ తేదీన మహారాష్ట్ర నుంచి ప్రశాంత్‌జాదెవ్, సుశాంత్‌జాదెవ్‌లు ఇరువులు కలసి కాకినాడ వచ్చారు. అదే రోజు రాత్రి 2.30 గంటల సమయంలో ప్రశాంత్‌జాదెవ్ వద్ద ఉన్న రెండో తాళం చెవితో షాపును తెరవగా సుశాంత్‌జాదవ్‌ను షాపు బయట కాపలా పెట్టి షాపులో ఉన్న రెండు బంగారు ముద్దలను దొంగిలించారని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. ఈ దొంగిలించిన బంగారం ముద్దలను కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న ఆవరణలో దాచిపెట్టి తిరిగి మహారాష్ట్రలోని వారి స్వగ్రామం వెళ్లిపోయారు. ఈ దొంగతనంపై అనుమానం వచ్చిన సీసీఎస్ డీఎస్పీ ఎ పల్లపురాజు తమ సిబ్బందితో మహారాష్ట్ర వెళ్లి టెక్నికల్ సపోర్టు ద్వారా దర్యాప్తు చేశారు.
ఈనెల 28న ముద్దాయిలైన ప్రశాంత్‌జాదెవ్, సుశాంత్‌జాదెవ్‌లు మహారాష్ట్ర నుంచి కాకినాడ వచ్చి సాయంత్రం ఐదు గంటల సమయంలో కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌లో దాచిపెట్టిన బంగారు ముద్దలను తీసుకెళ్లేందుకు వచ్చారని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. మహారాష్ట్ర నుంచి కాకినాడ వచ్చినట్టు డీఎస్పీ పల్లపురాజుకు ముందుగా రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ సీసీఎస్ ఎస్సై వి శ్రీనివాసరావు, ఎం రవీంద్ర, సీహెచ్ సుధాకర్, హెచ్‌సీ గోవిందరావు తమ సిబ్బందితో పోర్టు రైల్వే స్టేషన్ వద్ద దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన 743 గ్రాములు రెండు బంగారపు బిస్కెట్ ముద్దలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు.