‘ప్రేమ’కు పెళ్లి శాపమైంది

A Girl Escaped With A Boyfriend At Hanmakonda - Sakshi

భర్తను వదిలి ప్రియుడిని పెళ్లాడిన యువతి

పాపకు జన్మనిచ్చి ఆస్పత్రిలో మృతి

హన్మకొండ జీఎంహెచ్‌లో ఘటన

హన్మకొండ చౌరస్తా: ప్రేమ పెళ్లి ఓ యువకుడికి శాపమైంది. కట్టుబాట్లను కాదని వివాహం చేసుకున్న ఆ జంటను ఇరువైపుల కుటుంబాలు బహిష్కరించాయి. గర్భవతైన ఆ ఇల్లాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పాపకు జన్మనిచ్చిన అనంతరం రక్తస్రావంతో మృతి చెందింది. అయితే జేబులో చిల్లిగవ్వ లేని ఆ భర్త, భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేని స్థితిలో సాయంకోసం 16 గంటలపాటు ఎదురుచూపులు చూశాడు. ఈ ఘటన ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపురం గ్రామానికి చెందిన మామిండ్ల ప్రేమ్‌కుమార్, మందమర్రికి చెందిన ప్రవళిక (21) ప్రేమించుకున్నారు. ప్రవళిక ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేశారు.

కూతురు పుట్టిన తర్వాతా ప్రేమ్‌కుమార్, ప్రవళికల మధ్య ప్రేమ చావలేదు. దీంతో భర్తను వదిలేసిన ప్రవళిక ప్రేమ్‌ వద్దకు చేరగా ఇద్దరూ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్‌కాలనీలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ప్రేమ్‌కుమార్‌ ట్రాక్టర్‌ నడుపుతూ భార్యను పోషించుకుంటున్నాడు. శనివారం ప్రసవ తేదీ కావడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు జీఎంహెచ్‌కు తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ చేయడానికి రక్తం అవసరమని చెప్పడంతో ప్రేమ్‌ వరంగల్‌లోని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకు వెళ్లి ఒక బాటిల్‌ తీసుకొచ్చాడు.

ఒక బాటిల్‌ సరిపోదని మరోటి తేవాలని వైద్యులు చెప్పడంతో మరోసారి నగరంలోని బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎక్కడా రక్తం దొరక్కపోవడంతో ఆందోళనతో తిరిగి ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే ఆపరేషన్‌ ముగించిన వైద్యులు పాపకు జన్మనిచ్చిన ప్రవళిక సీరియస్‌గా ఉండడంతో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. అయితే రాత్రి  10 గంటల సమయంలో ఆమె మృతి చెం దిందని సిబ్బంది ప్రేమ్‌కు తెలిపారు. జేబులో చిల్లిగవ్వ లేక, సాయంకోసం భార్య తల్లిదండ్రులతోపాటు తన కుటుంబానికి తెలియజేస్తే వారి నుంచి స్పందన రాలేదు. ప్రేమ్‌కుమార్‌కు ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది రూ.5 వేలు అందజేయగా ఆదివారం ప్రవళిక మృతదేహంతో ప్రేమ్‌ బయటకు వచ్చాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top