గిరిజన యువతి మృతిపై అనుమానాలెన్నో...? | The Girl Died In A Suspicious State | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి మృతిపై అనుమానాలెన్నో...?

Jun 18 2018 11:16 AM | Updated on Aug 1 2018 2:20 PM

The Girl Died In A Suspicious State - Sakshi

ఉరివేసుకుని మృతిచెందిన దివ్య  

సాలూరురూరల్‌ (పాచిపెంట) : పాచిపెంట మండలంలోని విశ్వనాథపురం పంచాయతీ మంచాడవలస గ్రామానికి చెందిన గిరిజన యువతి  చీమల దివ్య (17) విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని శనివారం మృతి చెందింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు తెలియజేసిన వివరాలు మేరకు... దివ్య పాచిపెంట మండలంలో గతేడాది పదో తరగతి చదివింది.

కుటుంబ పోషణ కష్టంగా మారడంతో తల్లిదండ్రులు చీమల కృష్ణ, పోలమ్మ, చెల్లెలు వెంకటలక్ష్మితో కలిసి విశాఖపట్నానికి వలసపోయారు. కృష్ణ, పోలమ్మలు కూలి పనులు చేసుకుంటుండగా దివ్య సిరిపురంలోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వృద్ధ దంపతులైన నాటల గోపాలకృష్ణ, అనసూయలకు సహాయకురాలిగా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే దివ్య శనివారం  మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉంటున్న గదిలో  ఉరివేసుకుని చనిపోయింది.

దివ్య మృతిచెందడానికి కొంతసేపటి ముందు ఎవరితోనో ఫోన్‌లో సూమారు 10 నిమిషాలు మాట్లాడిందని, తర్వాత ముభావంగా ఉంటూ స్నానానికి తన రూమ్‌లోకి వెళ్లినట్లు తెలియవస్తోంది.  అయితే దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. మృతి వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండో కూతురు వెంకటలక్ష్మి రజస్వల కావడంతో ఆమెను తీసుకుని అమ్మమ్మగారు ఊరైన పనుకువలస గ్రామానికి ఈనెల 15న తల్లి పోలమ్మ వచ్చింది. తిరిగి శనివారం బయలుదేరుతుండగా కుమార్తె మృతి చెందిందని వార్త తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సాయంత్రం  మంచాడవలసలో దివ్య అంత్యక్రియలు నిర్వహించారు. దివ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement