బాలిక ఉసురుతీసిన వాటర్‌ హీటర్‌

Girl died Over Electric Shock In Medak - Sakshi

స్నానానికి వెళ్లి.. విద్యుత్‌షాక్‌కు గురై.. 

సీతారాంపల్లిలో విషాదం 

సాక్షి, వర్గల్‌(గజ్వేల్‌): పాఠశాలకు వెళ్లాలనే ఆతృత.. చలివేళ వేడి నీళ్ల తాపత్రయం.. అదే బాలిక పాలిట శాపంగా మారింది. స్నానానికి బాత్రూమ్‌లోకి వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక అనూష కరెంట్‌ హీటర్‌తో కూడిన నీటిని తాకింది. విద్యుత్‌ షాక్‌తో అసువులు బాసింది. కన్నవారికి కడుపుకోత మిగిలి్చన ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం వర్గల్‌ మండలం సీతారాంపల్లి గ్రామంలో జరిగింది. విద్యార్ధిని మృతి సమాచారంతో సంతాప సూచకంగా వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండా పాఠశాలలు మూసివేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వివరాలివి...

సీతారాంపల్లి గ్రామానికి చెందిన చిల్ల రవీందర్‌–జ్యోతి దంపతులకు అనూష(13), జశ్వంత్‌ ఇద్దరు పిల్లలు. గ్రామ సమీపంలోని వేలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అనూష ఎనిమిదో తరగతి, జశ్వంత్‌ ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు సకాలంలో చేరే ఆలోచనతో కాలకృత్యాలకు సిద్ధమైంది. స్నానం కోసం బాత్రూమ్‌లోకి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్‌ హీటర్‌ ఉన్న నీళ్లను తాకి విద్యుత్‌ షాక్‌కు గురైంది. స్నానానికి వెళ్లిన అనూష 15 నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తీసి చూడగా అప్పటికే కరెంట్‌షాక్‌తో బాలిక అపస్మారక స్థితిలో గుర్తించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పటికి బాలిక మృతి చెందినట్లు తెలిసి బోరుమన్నారు. 

అలుముకున్న విషాదం 
పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక అనూహ్యంగా మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు పెనువిషాదంలో కూరుకుపోయారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సహవిద్యారి్థని అనూష మృతి చెందిన సమాచారం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాయి. హెచ్‌ఎమ్‌ కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వద్ద సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల మూసేసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలిక సొంత గ్రామమైన సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలను, అదే పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లి తండా పాఠశాలలను సంతాప సూచకంగా మూసేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ఈ విషాద ఘటన పట్ల ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండాలలో విషాదం అలుముకున్నది.

చదవండి : చదవాలని మందలిస్తే..యాసిడ్‌ తాగి ఆత్మహత్య

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top