పక్కింటావిడే కదా అని నగలు చూపిన పాపానికి..

Ghaziabad Pregnant Murdered By Neighbours For Jewellery - Sakshi

నోయిడా : పొరుగింటి ఆవిడే కదా అని నగలు, బట్టలు చూపించిన పాపానికి గర్భిణి దారుణ హత్యకు గురయ్యింది. డబ్బు మీద వ్యామోహం ఉన్న పక్కింటి దంపతుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం... ఘజియాబాద్‌కు చెందిన మాలా, శివమ్‌లకు ఆరు నెలల క్రితం వివాహమయ్యింది. శివమ్‌ ఉద్యోగ నిమిత్తం బిస్రాఖ్‌ ఏరియాలోని ఓ అపార్టుమెంటులో వీరు అద్దెకు దిగారు. కాగా మాలా గర్భం దాల్చడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొత్తగా చేయించుకున్న నగలు, ఖరీదైన దుస్తులు మాలా వాళ్లకి చూపించింది. అదే సమయంలో పక్కింట్లో అద్దెకు ఉండే రీతూ అనే వివాహిత కూడా మాలా ఇంటికి వచ్చింది. ఆమె నగలు, బట్టలు చూసిన రీతూకు కళ్లు చెదిరాయి. ఎలాగైనా అవి తన సొంతం చేసుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది. అతడు కూడా ఇందుకు సరేననడంతో.. ఇద్దరూ కలిసి మాలాను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.

గొంతు నులిమి, సూట్‌కేసులో కుక్కి
తమ ఇంటికి రావాలంటూ రీతూ ఆహ్వానించడంతో మాలా సరేనంది. గురువారం శివమ్‌ ఆఫీసుకు వెళ్లిన తర్వాత రీతూ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో రీతూ భర్త దివాకర్‌ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాలాతో మాటలు కలిపిన రీతూ, దివాకర్‌లు ఆమె గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేశారు.  మాలా మరణించిందని ధ్రువీకరించుకున్న తర్వాత.. ఆమె ఫ్లాట్‌కు వెళ్లి నగలు, బట్టలు ఉన్న సూట్‌కేసు తీసి.. వాటి స్థానంలో మాలా శవాన్ని కుక్కారు. నగలు, బట్టలు తీసుకున్న అనంతరం రీతూ తన మేనమామ ఇంటికి వెళ్లగా.. దివాకర్‌ ఊరి శివారులో మాలా శవాన్ని పడేసి అక్కడికి చేరుకున్నాడు.

కట్నం కోసం అత్తింటివారే హత్య చేశారంటూ..
మాలా అకస్మాత్తుగా మాయమవడంతో కట్నం కోసం భర్త, అత్తింటి వారే ఆమెను హత్య చేసి ఉంటారంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మాలా కనిపించకుండా పోయిన సమమయంలో ఆమె భర్త ఆఫీసులో, అత్తామామలు వారి ఇంటి వద్దే ఉన్నారని నిర్ధారించారు. మాలా మాయమైన నాటి నుంచి పక్కింట్లో ఉండే రీతూ, దివాకర్‌లు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు గౌతం బుద్ధ నగర్‌ ఎస్‌ఎస్‌పీ అజయ్‌ పాల్‌ శర్మ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top