మృత్యువులోనూ వీడని స్నేహం

Friends Died In Bike Accident Krishna - Sakshi

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకుల మృతి

మరో యువకుడి పరిస్థితి విషమం

వెంకటదుర్గాంబపురం, పోలాటితిప్పల్లో విషాదం

కృష్ణాజిల్లా, కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం) : ఆ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు.. కలిసి బడికి వెళ్ళారు... కలిసి ఆడుకున్నారు... కలిసే పెరిగారు... ఎక్కడి వెళ్ళినా కలిసే వెళ్లేవారు. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కలిసే పాల్గొనేవారు. ఒకరంటే ఒకరికి నమ్మకం... అలాంటి ఆ స్నేహితులకు మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. క్షణాల్లో వారిపైకి దూసుకువచ్చింది. అప్పటి వరకు ఏమరుపాటుగా ఉన్న ఆ ముగ్గురూ ఎదురుగా వచ్చిన మృత్యువును చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయవిదారకర ఘటన బందరు మండలం చిన్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి..
బందరు మండలం వాడపాలెం పంచాయతీ శివారు వెంకటదుర్గాంబపురానికి చెందిన ఒడుగు కుమార్‌స్వామి, మోకా సహదేవుడు (19), ఒడుగు సాయికుమార్‌ (20) స్నేహితులు. కుమార్‌స్వామి కృష్ణా యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. సహదేవుడు పవిత్ర డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్‌ చదువుతున్నాడు. సాయికుమార్‌ ఇంటర్‌ వరకు చదివి ప్రస్తుతం చేపల చెరువుపై ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. చిన్ననాటి స్నేహితులైన వీరు ముగ్గురూ ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. సహదేవుడికి ఎగ్జామ్‌ ఉండటంతో బుధవారం బైక్‌పై ముగ్గురూ బందరు బయలుదేరారు. చిన్నాపురం శివారు శ్మశానం సమీపంలోని మలుపు వద్ద భీమవరం నుంచి కోన చేపల చెరువు వద్దకు వెళ్తున్న లారీ వేగంగా వారి బైక్‌పైకి దూసుకువచ్చింది. అకస్మాత్తుగా లారీ మీదకు దూసుకురావటంతో కుమార్‌స్వామి బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు. అప్పటికే లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సహదేవుడు, సాయికుమార్‌లకు రోడ్డు దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయారు. బైక్‌ నడుపుతున్న కుమార్‌స్వామి కాళ్ళు, చేతులకు బలమైన గాయాలై రోడ్డు పక్క పడిపోయాడు.

చికిత్స పొందుతూ మృతి..
స్థానికులు 108కు ఫోన్‌ చేసి ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సహదేవుడు, సాయికుమార్‌ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. కుమారస్వామి కొనఊపిరితో కొట్టుకుంటుండగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కదిలొచ్చిన రెండు గ్రామాలు..
విషయం తెలుసుకున్న వెంకటదుర్గాంబపురం, పోలాటితిప్ప గ్రామస్తులు ఆస్పత్రికి తరలివచ్చారు. చేతికి అందిన బిడ్డలు శవాలుగా మారటాన్ని చూసిన తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు సైతం బోరున విలపించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదచాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ..
చిన్నాపురంలోని ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకోవాలని బందరు రూరల్‌ పోలీసులకు  సూచించారు. ఆయనతోపాటు బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా, బందరు రూరల్‌ సీఐ బి. రవికుమార్‌ ఉన్నారు.

నాయకుల పరామర్శ..
విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల బంధువులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా, మాజీ జెడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఎల్‌ ఎన్‌ ప్రసాద్, ఇతర నాయకులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top