యువకుడి దారుణ హత్య

Friend Assassinated in Kadthal Illegal Relation With Cousin - Sakshi

వివాహేతర సంబంధమే కారణం!

ఇంటికి పిలిపించి మరీ కడతేర్చిన స్నేహితుడు, కుటుంబ సభ్యులు

కడ్తాల్‌ మండలం మర్రిపల్లిలో ఘటన

కడ్తాల్‌: కడ్తాల్‌ మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడే తన ఇంటికి రప్పించుకుని, కుటుంబ సభ్యులతో కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్‌ (28) వృత్తిరీత్యా ప్రైవేటు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిçన కిరణ్‌ స్నేహితుడైన ఏదుల మహేష్‌.. కిరన్‌కు ఫోన్‌ చేసి తన ఇంటికి రమ్మని కోరడంతో కిరన్‌ అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో మహేష్‌ ఇంటికి వెళ్లాడు.

ఇంటికి వచ్చిన కిరణ్‌ను.. మహేష్‌ తన వదినతో వివాహేతర సంబంధం విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే అక్కడికి మహేష్‌ సోదరుడు, వదిన కూడా రావడంతో గొడవ పెద్దదైంది. దీంతో మహేష్, అతని సోదరుడు శ్రీశైలం, వదిన రమాదేవితో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కిరణ్‌ను గొడ్డలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పథకం ప్రకారమే మహేష్‌ కుటుంబ సభ్యులు తన కుమారుడిని ఇంటికి పిలిపించుకుని కొట్టి చంపారని కిరణ్‌ తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తన కుమారుడి హత్యకు మహేష్, శ్రీశైలం, రమాదేవి, కళమ్మ, లాలయ్య, సురేష్, మాసని రాజు కారణమని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

గ్రామంలో భయాందోళనలు....
కిరణ్‌ హత్యతో మర్రిపల్లి గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మర్రిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా కిరణ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. ఎసీపీ వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎసీపీ సురేందర్, సీఐ నర్సిహ్మారెడ్డి మర్రిపల్లి గ్రామానికి చేరుకుని కిరణ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తరలించడానికి ఒప్పుకున్నారు. క్లూస్‌టీం సభ్యులు హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. కడ్తాల్‌ ఎస్‌హెచ్‌ఓ సుందరయ్య ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top