‘బొమ్మ’ చూసి ‘సొమ్ము’ ఇస్తే అంతే | fraud sales in olx and e commerce apps | Sakshi
Sakshi News home page

‘బొమ్మ’ చూసి ‘సొమ్ము’ ఇస్తే అంతే

Dec 30 2017 6:58 AM | Updated on Dec 30 2017 6:58 AM

fraud sales in olx and e commerce apps - Sakshi

సాక్షి,బెంగళూరు: నగరంలో కొత్త తరహా మోసాలకు తెరలేసింది. ఇప్పటి వరకూ వేల కోట్ల రూపాయల విలువచేసే లాటరీ తగిలింది పన్నులు చెల్లిస్తే ఆ మొత్తం మీ అకౌంట్‌లోకి వేస్తామంటూ అక్రమాలకు పాల్పడిన ఘటనలే చూశాము. తాజాగా ఎయిర్‌ పోర్టులో పార్కింగ్‌ చేసిన కారు తక్కువ ధరకు దొరుకుతుందని చెబుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న దుండగులు బెంగళూరులో ఎక్కువవుతున్నారు. సదరు గ్యాంగ్‌లో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కేసులు గత వారం రోజుల్లో నగరంలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (పోలీసులు, బాధితుల కోరిక మేరకు పేర్లు మార్చబడ్డాయి.)

ఓఎల్‌ఎక్స్‌లో మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ వాహనాన్ని రూ.3.8 లక్షలకు అమ్ముతామని యాడ్‌ పెట్టారు. విషయం గమనించిన హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌కు చెందిన వినోద్‌ అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేశారు. వాహనం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉందని మరిన్ని వివరాల కోసం సవితా అనే మహిళలకు కాల్‌ చేయాలని ఫోన్‌నంబర్‌ ఇచ్చాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత పార్కింగ్‌ ఫీ చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతానికి వాహనాన్ని చూపించడానికి కాదన్నారు. పార్కింగ్‌ ఫీజును చెల్లిస్తే వాహనాన్ని అందజేస్తామని సదరు మొత్తాన్ని ఫైనల్‌ సెటిల్‌మెంట్‌లో తగ్గించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని నమ్మిన వినోద్‌ మొతట వారు చెప్పినట్లు బసవరాజ్‌ అనే అకౌంట్‌కు  మొదట రూ.1.8 లక్షలు అటుపై రూ.49 వేలను ఆన్‌లైన్‌ ద్వారా వారు చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తదుపరి రోజు ఫోన్‌ చేస్తే వారి ముగ్గురు ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించిన వినోద్‌ హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఫిర్యాదు చేశారు.

అన్నసంద్రపాళ్యకు చెందిన మరో ప్రైవేటు బ్యాంక్‌ ఉద్యోగి అయిన  కూడా ఓఎల్‌ఎక్స్‌లోని యాడ్‌ను చూసి మారుతీ బ్రీజా వాహనం కోసం రూ.4.88 లక్షలను నేరుగా ఇద్దరు వ్యక్తులకు ఇచ్చానని అయితే వారు సొమ్ము తీసుకున్న తర్వాత వాహనం ఇవ్వలేదని అంతే కాకుండా గత నాలుగురోజులుగా వారి ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ అయినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

నగరంలోని ఇందిరా నగర్‌లో నివసించే వినీత్‌ అనే వ్యక్తి కూడా ఓఎల్‌ఎక్స్‌లో హుండాయ్‌ ఐ 20 అమ్ముతామనే యాడ్‌ను చూసి రూ.96,500 పోగొట్టుకున్నాడు. ఈ సొత్తును మూడు విడుతలగా ఈనెల 15 నుంచి 22 లోపు ఫ్లోరా సేనా, అనితా అనే ఇద్దరు మహిళల అకౌంట్‌కు వేశారు. మొదటి రోజు ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో వాహనం ఉందని చెప్పిన వారు గత రెండు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారని బాదితుడు వాపోతున్నారు. ఈ మూడు కేసులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రస్తుతం సైబర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటువంటి సెకెండ్‌ హ్యాండ్‌ వస్తువులను ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నగర జాయింట్‌ కమిషనర్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement