ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి

Former MLA Nallala Odelu Follower Gattaiah Died In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/జైపూర్‌: టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్‌ను నల్లాల ఓదెలుకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించిన రేగుంట గట్టయ్య (32) మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూరు టికెట్‌ తనకు కాకుండా ఎంపీ బాల్క సుమన్‌కు ఇవ్వడంతో ఓదెలు ఈ నెల 11న మందమర్రిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 12న జైపూర్‌ మండలం ఇందారంలో అభివృద్ధి పనులకు భూమిపూజతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఎంపీ బాల్క సుమన్‌ వచ్చారు.

ఈ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు, ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్‌ పోసుకున్న గట్టయ్యకు మహిళల మంగళహారతుల నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గట్టయ్య సహా 16 మందికి గాయాలయ్యాయి. 60 శాతానికిపైగా కాలిన గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ నెల 13న మలక్‌పేట యశోదకు మార్చారు. కాగా, చికిత్సపొందుతూ మంగళవారం గట్టయ్య మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయివిజ్ఞేశ్‌(3) ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గట్టయ్య ఇద్దరు పిల్లల పేరిట రూ. 5 లక్షల చొప్పున బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తానని తెలిపారు. ప్రభుత్వపరంగా వచ్చే ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేలా చూస్తానన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ లేదా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పించి అతని కుటుంబాన్ని అన్ని వి««ధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top