మద్యంలో నిద్రమాత్రలు కలిపి..

Fish Businessman Ramesh Murder Case Reveals Hyderabad police - Sakshi

తలపై సుత్తితో మోది అంతమొందించాడు

డబ్బు కోసం పథకం ప్రకారమే ఘాతుకం

మృతదేహాన్ని మాయం చేసేందుకే ముక్కలుగా..

కొలిక్కి వచ్చిన చేపల వ్యాపారి హత్య కేసు  

టాస్క్‌ఫోర్స్‌ అదుపులో నిందితుడు రాజు నాయక్‌

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చిన చేపల వ్యాపారి పి.రమేష్‌ (50) హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈయనకు పరిచయస్తుడైన, గతంలో వీరి ఇంట్లో అద్దెకు ఉన్న రాజు నాయక్‌ డబ్బు కోసమే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్పష్టంమైంది. మద్యంలో నిద్రమాత్రలు కలిపి రమేష్‌తో తాగించిన రాజు.. అపస్మాకర స్థితిలోకి చేరుకున్న తర్వాత సుత్తితో తలపై మోది హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతోనే ముక్కలుగా కత్తిరించడానికి సిద్ధమయ్యాడని తేలింది. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడు రాజు నాయక్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 

సినిమాలపై మోజుతో సిటీకి రాక..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన రాజు నాయక్‌ అలియాస్‌ రిజ్వాన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ అక్కడే డిగ్రీ పూర్తి చేశాడు. సినిమాలపై మోజు ఉన్న ఇతగాడు వివాహానంతరం నగరానికి వలసవచ్చాడు. కొన్నాళ్లు  ఏజీ కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీలో ఉన్న రమేష్‌ ఇంటి మొదటి అంతస్తులో ఆరేళ్ల పాటు అద్దెకు ఉన్నాడు. సినీ రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో జూనియర్‌ ఆర్టిస్టుగా కార్డు కూడా తీసుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇతడికి నిరాశే మిగిలింది. దీంతో 2015లో మరికొందరితో కలిసి ‘రేపల్లె ప్యాసింజర్‌’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ రూపొందించి యూ ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేశాడు. కొన్నాళ్ల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్న రాజు ఇద్దరు భార్యల్నీ నగరంలోని గాంధీనగర్, మల్కాజిగిరిలలో వేర్వేరుగా ఉంచాడు. ఒక్కో భార్యకు ఇద్దరు చొప్పున ప్రస్తుతం రాజుకు నలుగురు సంతానం. బతుకుదెరువు కోసం ఓ ఆన్‌లైన్‌ సంస్థలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇతడిపై గతంలో చిలకలగూడ పోలీసు           స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. 

ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో...
ఫుడ్‌ డెలివరీబాయ్‌గా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు చాలకపోవడంతో పాటు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. గతంలో రమేష్‌ ఇంట్లో అద్దెకు ఉండటం, ఇద్దరూ కలిసి పలుమార్లు మద్యం తాగడం, అతడి వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు తెలిసి ఉండటంతో అతడినే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పథకం ప్రకారం 15 రోజుల క్రితం జవహర్‌నగర్‌లో శ్రీనివాస్‌ అనే పేరుతో గది అద్దెకు తీసుకున్నాడు. గత నెల 26 నుంచి రెండుసార్లు రమేష్‌ను అక్కడకు ఆహ్వానించి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. రమేష్‌కు ఫోన్లు చేయడం కోసం కొత్తగా ఓ సెల్‌ఫోన్‌ ఖరీదు చేశాడు. రోడ్డుపై లభించిన ఓ సిమ్‌కార్డును అందులో వేసి, రీచార్జి చేసి వినియోగించాడు. గత శనివారం సాయంత్రం 6.30 గంటలకు రమేష్‌కు ఫోన్‌ చేసిన రాజు నాయక్‌.. ఈఎస్‌ఐ వద్దకు పిలిచాడు. అక్కడ నుంచి రమేష్‌ను ఆయన స్కూటీపై జవహర్‌నగర్‌లోని తన అద్దె గదికి తీసుకొచ్చాడు. తనకు రూ.90 లక్షలు కావాలని కోరాడు. దీనికి రమేష్‌ తిరస్కరించి.. తన వద్ద అంత మొత్తం లేదని తేల్చి చెప్పాడు. 

అదను చూసుకుని..
ఆపై ఇద్దరూ మద్యం తాగడానికి ఉపక్రమించారు. రాజు నాయక్‌ అదను చూసుకుని అప్పటికే సిద్ధం చేసి ఉంచుకున్న నిద్రమాత్రల్ని మద్యంలో కలిసి రమేష్‌తో తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత సిద్ధం చేసి ఉంచిన సుత్తితో తలపై మోది చంపేశాడు. హతుడి మెడలో ఉన్న నాలుగు ఉంగరాలు, మెడలోని రెండు గొలుసులు తీసుకుని, మృతదేహాన్ని అదే గదిలో వదిలేసి శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని తన ఇంటికి వెళ్లాడు.  మృతదేహం నుంచి తీసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టాడు. మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో ఆదివారం తన భార్యను, కుమారుడైన చిన్నారిని తీసుకుని హతుడి స్కూటీపై జవహర్‌నగర్‌లోని గదికి వచ్చాడు. దానికి ముందే మోండా మార్కెట్‌ ప్రాంతంలో ఓ పెద్ద కత్తిని ఖరీదు చేశాడు. గదికి వచ్చిన తర్వాత మృతదేహాన్ని అలా తరలించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లోని చెత్త కుండీల్లో పారేయడానికి పథకం వేశాడు. ముందుగా మృతదేహానికి ఉన్న రెండు చేతులు నరికేశాడు. వాటిని ఓ కవర్‌లో పెట్టి తరలించడానికి సిద్ధమై... కాళ్లనూ నరకడానికి ప్రయత్నించాడు.  

డబ్బు డిమాండ్‌ చేస్తూ సందేశాలు..
మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించడానికి వెనుకాడిన రాజు నాయక్‌ అక్కడే వదిలేసి, గదికి తాళం వేసి.. భార్య, కుమారుడితో కలిసి మల్కాజిగిరి వెళ్లిపోయాడు. రమేష్‌ కోడలికి హతుడి సెల్‌ఫోన్‌ నుంచే రూ.19 లక్షలు ఇస్తే మీ మామను వదిలేస్తానంటూ మెసేజ్‌ పెట్టాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం మరోసారి భార్యతో కలిసి జవహర్‌నగర్‌కు వచ్చిన రాజు గదిలోని సామాన్లు సర్దుకుని వెళ్లిపోయాడు. గురువారం సాయంత్రం గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అది రమేష్‌ మృతదేహంగా గుర్తించారు. దీంతో ఎస్సార్‌నగర్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసును, మర్డర్‌ కేసుగా మార్చారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు ముషీరాబాద్‌లోని రాజు ఇంటిని గుర్తించి అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె సహకారంతో బుధవారం రాత్రి మల్కాజిగిరిలోని మరో భార్య వద్ద ఉన్న రాజును పట్టుకున్నారు. ఇతడి నుంచి కత్తి, సుత్తితో పాటు హతుడి బంగారం తాకట్టు పెట్టిన రసీదులు స్వాధీనం చేసుకున్నారు. తాకట్టు దుకాణం నుంచి బంగారం రికవరీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top