క్షణాల్లో బుగ్గి

Fire Accident in Nampally Exhibition Ground Hyderabad - Sakshi

ఫైర్‌ సేఫ్టీ లేకే భారీ నష్టం

నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం

కాలిపోయిన దాదాపు 400 స్టాళ్లు

తప్పిన ప్రాణ నష్టం రూ.కోట్లలో ఆస్తినష్టం

కట్టుబట్టలతో మిగిలిన వ్యాపారులు

నాలుగున్నర గంటలు.. చెలరేగిన మంటలు

మంటలు ఆర్పిన 19 ఫైరింజన్లు

సకాలంలో స్పందించలేదంటూ వ్యాపారుల నిరసన

సంఘటన స్థలానికి చేరుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ రామ్మోహన్,

మాజీ మంత్రులు తలసాని, పద్మారావు, కమిషనర్‌ ఫైర్‌ సేఫ్టీ లేకనే భారీ నష్టం

ఎల్బీనగర్‌ రూట్‌కు ఐదు ప్రత్యేక రైళ్లు

సాక్షి, సిటీబ్యూరో:  వేలాది స్టాళ్లు..లక్షలాది మంది సందర్శకులు, విందు–వినోదాలు, షాపింగ్‌లు, సరదా ఆటపాటలతో ఏటా దాదాపు నెలన్నర రోజులపాటు నగరవాసులను అలరించే ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) కాలి బూడిదైంది.79 సంవత్సరాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆంధ్రా బ్యాంకు స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఎగసిపడి..క్షణాల్లోనే అంతటా వ్యాపించాయి. దీంతో దాదాపు 400 స్టాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏం జరిగిందో తెలియక.. ఎగసిపడుతున్న మంటలు చూసి సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఈ దశలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లు, 19 ఫైరింజన్లు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. సందర్శకులను సురక్షితంగా బయటకుపంపించాయి. దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

వీరిని వెంటనే అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. కళ్ల ముందే తమ షాపులన్నీఅగ్నికి ఆహుతై  కట్టుబట్టలే మిగిలాయంటూ స్టాళ్ల యజమానులు బోరున విలపించారు. మంటల్లో బూడిదైన వాటిలో చేనేత, చేతితో రూపొందించిన గృహోపకరణాల స్టాళ్లే అధికంగా ఉండటంతో  రూ.కోట్లలో ఆస్తినష్టంసంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తుండగా,మరికొందరు వ్యాపారులు మాత్రం ఓసందర్శకుడు తాగిన సిగరెట్‌ కారమణమని పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ భారీ ఆస్తి నష్టంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు.  సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే నష్టతీవ్రత పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ బాధితులకు ఆదుకుంటామని చెప్పారు. మాజీ మంత్రులు తలసాని, పద్మారావు, మేయర్‌ రామ్మోహన్‌లు  బాధితులను ఓదార్చారు. సందర్శకులు హుటాహుటిన బయటకు వెళ్లే క్రమంలో ఎగ్జిబిషన్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. దీంతో అసెంబ్లీ నుంచి నాంపల్లి వెళ్లే రూట్‌లో రాకపోకలు నిలిపివేసి వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.  

అబిడ్స్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎలాంటి ఫైర్‌ సేఫ్టీ సిస్టం లేకపోవడం వల్లే అగ్నిప్రమాదం తీవ్రత బాగా పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌ను దాదాపు 30 లక్షల మంది సందర్శిస్తారు. కానీ ఎగ్జిబిషన్‌ సొసైటీ ఫైర్‌ సేఫ్టీని గాలికి వదిలేసింది. ఓపెన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఇలాంటి ఎగ్జిబిషన్లకు ముంబాయి, ఢిల్లీలాంటి నగరాల్లో హైడ్రెంట్‌ వాల్‌ ఫైర్‌ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేస్తారు. కానీ మన దగ్గర ఎగ్జిబిషన్‌లో ఈ సిస్టం లేకపోవడంతోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగి రూ.కోట్లలో నష్టం సంభవించింది.

సందర్శించిన ఉన్నతాధికారులు...
ఎగ్జిబిషన్‌ను పలువురు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ చౌహాన్, ఉన్నతాధికారి షికాగోయల్‌లు సంఘటన స్థలంలో ఉండి పరిస్థితులను చక్కదిద్దారు. అదేవిధంగా గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎగ్జిబిషన్‌లో ఉండి పరిస్థితిని సమీక్షించారు. గుజరాత్‌ రాష్ట్రం నుంచి వచ్చిన సంగీత ఏర్పాటుచేసిన బట్టల స్టాల్‌ కాలి బూడిదయింది. ఆమె లబోదిబోమంటూ రోదించింది. లక్షల రూపాయలు నష్టం జరిగిందన్నారు. తమకు తిరిగి ఆస్తినష్టం చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

ఈ సిస్టం ఉంటే...
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటుచేసిన ప్రతి స్టాల్‌లో ఫైర్‌ సేఫ్టీ మేజర్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయాలి
స్టాళ్లలో ఫైర్‌ ఎగ్జిస్టింగ్‌ మెషిన్స్‌ ఉంచాలి
హైడ్రెంట్‌ వాల్‌ సిస్టం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

మెట్రోలో ఉచిత ప్రయాణం
హుటాహుటిన ఎల్‌బీనగర్‌వైపునకు ఐదు రైళ్లు
ప్రయాణికులకు ఉచిత సేవలు  
అసెంబ్లీ టు నాంపల్లి రూట్‌లో భారీ ట్రాఫిక్‌జామ్‌..వాహనాల దారి మళ్లింపు  

ఎగ్జిబిషన్‌ సందర్శనకు వచ్చిన వారిని ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన  మెట్రో....ఎల్‌బీనగర్‌ వైపునకు ఐదు రైళ్లు నడిపింది. ప్రయాణికులను ఉచితంగా చేరవేసింది. అసెంబ్లీ నుంచి నాంపల్లి వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని గమనించి వాహనాలను దారి మళ్లించారు. మంటలు ఆర్పడానికి 19 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.   

శభాష్‌ బస్వరాజ్‌  
మంటలు ప్రారంభం అయినప్పుడు బందోబస్తులో ఉన్న హుమాయూన్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ బస్వరాజ్‌ చాకచక్యంగా పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఆంధ్రాబ్యాంక్‌ స్టాల్‌ సమీపంలోనే హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల స్టాల్‌ ఉంది. కానీ స్టాల్‌పైన ఉన్న విద్యుత్‌ వైర్లను బస్వరాజ్‌ వెంటనే స్టాల్‌ ఎక్కి విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. 

పలువురికి గాయాలు..
ఫైర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్, స్టాల్‌ నిర్వాహకులు దిలావర్‌ హుస్సేన్‌లు భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇబ్బందులకు గురయ్యారు. స్వల్ప గాయాలతో వీరు పడిపోగా వెంటనే సమీపంలోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఎగ్జిబిషన్‌లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్‌ అందుబాటులో ఉంచలేదని, ఎగ్జిబిషన్‌ సొసైటీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని స్టాల్‌ హోల్డర్‌ ముజాహిద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రజల సేఫ్టీని గాలికి వదిలేసిందన్నారు. ఫైర్‌ సేఫ్టీపట్ల చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం సంభవించేది కాదన్నారు. అంతేకాక ఎగ్జిబిషన్‌ సొసైటీ కాలిపోయిన స్టాల్స్‌ నిర్వాహకులకు తిరిగి నష్టపరిహారంచెల్లించాలన్నారు. ఎన్నో రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఘటనాస్థలికి హోంమంత్రి, ఇతర నేతలు
అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్, మేయర్‌ బొంతు రామ్మెహన్‌  కూడా అధికారులను పురమాయించారు. జలమండలి, అగ్నిమాపక, పోలీస్‌ విభాగాలను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని  తరలించేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top