పుట్టింటికి వెళ్తున్నామని.. పత్తా లేకుండా పోయారు..

Father And Daughter Missing From Husband Home YSR Kadapa - Sakshi

అత్తవారింటి నుంచి కూతురిని తీసుకెళ్లిన తండ్రి

ఆపై ఆచూకీ లేని వైనం

తండ్రీ, కూతురు పరారీపై పలు అనుమానాలు

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ఖాజీపేట : అత్తింట్లో ఉన్న ఆ యువతి వద్దకు ఆమె తండ్రి వచ్చి పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకు వస్తానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో  ఆందోళన చెందిన అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే యువకునికి ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికతో 3 నెలల క్రితం వివాహమైంది. వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మౌనిక  తండ్రి అనంత రెడ్డి  ఆగస్టు 25న కొమ్మలూరుకు వచ్చి తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తానని చెప్పి పిలుచుకుని పోయాడు. మామను, భార్యను  రామకృష్ణారెడ్డి ఖాజీపేట బస్టాండ్‌కు తీసుకు వచ్చి బస్సు ఎక్కించి పంపాడు. తరువాత వారు ప్రకాశం జిల్లాలోని వారి ఇంటికి వెళ్లలేదు. ఇటు కొమ్మలూరుకు రాలేదు. సుమారు 45 రోజులు దాటినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన రామకృష్ణారెడ్డి  ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

పెళ్లిళ్లు చేసుకోవడం పరారవడం..?
మౌనిక తన భర్తతో గొడవ పడి వెళ్లిందా లేక ఇంటిలోని బంగారాన్ని తీసుకుని  ఉడాయించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో గొడవ పడితే పుట్టింటికి వెళ్లాలి కానీ ఇలా ఎవ్వరికీ అంతుచిక్కకుండా వెళ్లడంపై పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఆమె తండ్రి అనంత రెడ్డి పాత్ర పై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మౌనిక స్వగ్రామానికి వెళ్లి విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఇలా గే కొందరిని వివాహం చేసుకుని ఆ తరువాత డబ్బు, బంగారంతో అత్తవారింటి నుంచి పరారైనట్లు అక్కడి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

తండ్రి, కూతురు కనిపించకపోయినా కనీసం మౌనిక కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం కూడా పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తమది పేద కుటుంబం అని తాము ఎలాంటి కట్న కానుకలు ఇవ్వలేమని చెప్పడం.. ఆ తర్వాత పెళ్లి కుమారునితోనే అమ్మాయికి బంగారం పెట్టించడం.. అలా వచ్చిన బంగారంతో ఉడాయించడం జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫోన్‌ ఆధారంగా వారి ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు వారు ఎందుకు వెళ్లిపోయారు.. పుట్టింటికి ఎందుకు వెళ్లలేదు.. అందుకు కారణం ఏమిటి.. కేవలం బంగారం కోసమే ఇలా చేశారా.. భర్తతో వచ్చిన గొడవలే కారణమా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తండ్రి, కూతురు ఆచూకీ దొరికితే గానీ మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top