రికవరీ ఏజెంట్ల దాష్టీకం

UP Farmer killed by Recovery Agents - Sakshi

సీతాపూర్‌ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. లోన్‌ కట్టలేదని ఓ రైతును రికవరీ ఏజెంట్లు దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తన ట్రాక్టర్‌ కిందే ఆ రైతన్న ప్రాణాలు కోల్పోయాడు. 

లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్‌ గ్రామానికి చెందిన గ్యాన్‌ చంద్ర(45) కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ ఫైనాన్షియర్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఓ ట్రాక్టర్‌ కొనుక్కుని వినియోగించుకుంటున్నాడు. వడ్డీతో కలిపి ఆ ఫైనాన్షియర్‌కు లక్షా 25వేలు కట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే గ్యాన్‌ 35,000 రూపాయలను చెల్లించాడు. మిగిలిన డబ్బు కట్టడానికి కాస్త గడువు కోరాడు. 

కానీ, రెండు రోజుల క్రితం అతని ఇంటికి వచ్చిన ఐదుగురు లోన్‌ రికవరీ ఏజెంట్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. బలవంతంగా అతని నుంచి తాళాలు లాక్కుని ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్‌.. గ్యాన్‌ను బలంగా నెట్టేశాడు. దీంతో అతను కిందపడిపోగా.. ట్రాక్టర్‌ నడుపుతున్న వ్యక్తి అతని మీద నుంచి ఎక్కించేశాడు. గ్యాన్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. ఏజెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. 

కళ్ల ముందే తమ సోదరుడి దారుణంగా హతమార్చారని గ్యాన్‌ చంద్ర సోదరుడు ఓమ్‌ ప్రకాశ్‌ చెబుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. 

చంద్రకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. అతనికి ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. గతేడాది చిన్న, సన్నకారు రైతులకు రుణ మాఫీ పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌.. 87 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. అయితే ఆ లోన్‌ను కేవలం కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేయటంతో.. రైతులంతా ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. సాలీనా రాష్ట్ర గ్రామీణ ఆదాయంలో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తులకు వాటా పెరుగుతూ వస్తోంది. గతేడాది అది 28.2 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top