చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోకరా

Family Cheat Four Crore and Escpae in Vijayawada - Sakshi

పరారీలో కుటుంబం.?

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

అమరావతి,గుడివాడ: చిట్టీ వ్యాపారం పేరుతో మోసం చేసి సుమారు రూ. 4 కోట్లతో పరారీ అయిన దంపతుల ఉదంతం గుడివాడ పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడ పట్టణం 35వ వార్డు కొత్తవారి వీధిలో నివాసం ఉండే సింహాద్రి లక్ష్మణరావు, అతని భార్య సత్యవతిలు చిట్టీలు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. స్థానికంగా ఉన్న వారితో సఖ్యతగా మెలుగుతూ వారి వద్ద చిట్టీలు కట్టించుకుంటూ ఉండేవారు. వీరు సొంతంగా రూ. 2 లక్షలు, రూ.5 లక్షలు, రూ. 3 లక్షలు చిట్టీలు వేయగా.. సత్యవతి సమీపంలోని వారి వద్ద ఈమె కూడా చిట్టీలు వేసి పాడుకుంది. రెండు నెలలుగా చిట్టీలు కట్టించుకుని పాడుకున్న వారికి నగదు ఇవ్వడం లేదు.

అధిక వడ్డీ ఆశ చూపి...
సత్యవతి వద్ద చిట్టీలు వేసిన వారు పాడుకుంటే మీ డబ్బుకు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపేదని బాధితులు చెబుతున్నారు. దీంతో ఆశపడిన వారు పాడిన చిట్టీ సొమ్ము మొత్తాన్ని సత్యవతికి ఇచ్చేవారు. అలాగే సత్యవతి బయట వేసిన చిట్టీలు ముందే పాడుకుని కట్టటం లేదు. అనుమానం వచ్చిన బాధితులు లక్ష్మణరావు ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. బాధితులంతా ఏకమై శుక్రవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులను ఆశ్రయించారు. రాత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

కనిపించడం లేదని ఫిర్యాదు
కాగా తమ అక్కా,బావ, ఇద్దరు పిల్లలు ఈ నెల 16 నుంచి కనిపించడం లేదని, ఫోన్‌ చేసినా స్పందన లేదని సత్యవతి సోదరుడు కరుణ్‌కుమార్‌ స్థానిక టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top