ఈ బీమాతో లేదు ధీమా! | Fake Insurance Fraud Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

ఈ బీమాతో లేదు ధీమా!

May 27 2019 7:56 AM | Updated on May 27 2019 7:57 AM

Fake Insurance Fraud Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా వాహనానికి బీమా ఎందుకు చేయించుకుంటారు..? నిబంధనల ప్రకారం తప్పనిసరి కావడం ఒక కారణమైతే, ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే  కుటుంబానికి అక్కరకు వస్తుందనే ధీమా మరో కారణం. ఆ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బీమా పత్రాలు బోగస్‌ అని తేలితే... ఆ నష్టం ఎవ్వరూ పూడ్చలేనిదిగా మారుతుంది. తాను బజాజ్‌ అలయన్జ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఏజెంట్‌గా పరిచయం చేసుకుని, డబ్బు తీసుకున్న     తర్వాత తానే తయారు చేసిన బోగస్‌ సర్టిఫికెట్లు అందిస్తున్న మోసగాడిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. ఇతగాడు 293 మంది వాహనాలకు సంబంధించి ఇలాంటి బోగస్‌ పత్రాలు తయారు చేసి అందించినట్లు ఆయన వివరించారు. 

ఎంబీఏ చదివి నగరానికి వచ్చి...
కరీంనగర్‌ జిల్లా కదికొట్కూర్‌ గ్రామానికి చెందిన గుడిమల శ్రీకాంత్‌ ఎంబీఏ పూర్తి చేశాడు. బతుకుతెరువు కోసం మూడేళ్ళ క్రితం నగరానికి బోయిన్‌పల్లి ఆనంద్‌నగర్‌ల్లో స్థిరపడ్డాడు. కొన్నాళ్ళ పాటు ఈసీఐఎల్‌ కేంద్రంగా బజాజ్‌ అలయన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో టెరిటొరీ మేనేజర్‌గా (టీఎం) విధులు నిర్వర్తించాడు. వాహన యజమానులు, వాహనాల షోరూమ్స్‌ నిర్వాహకుల నుంచి వివరాలు, బీమా మొత్తం వసూలు చేయడం, తమ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్‌ చేయించి ఆ పత్రాలను తిరిగి వారికి అందించడం ఇతడి విధి. కొన్నాళ్ళ పాటు సక్రమంగా పని చేసినా ఆపై శ్రీకాంత్‌ బుద్ధి వక్రమార్గం పట్టడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై కొంతకాలం ఖాళీగానే ఉన్న ఇతగాడికి ఓ దుర్బుద్ధిపుట్టింది. వాహన ఇన్సూరెన్స్‌ రంగంలో తనకు ఉన్న అనుభవాన్ని వాడుకుని బోగస్‌ బీమా పత్రాలు అందించే దందా ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా తాను ఇప్పటికీ బజాజ్‌ అలయన్జ్‌ సంస్థలో పని చేస్తున్నట్లు బోగస్‌ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. 

ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి...
ఈ బోగస్‌ కార్డుతో పాటు తన ‘పాత యూనిఫాం’ ఆధారంగా బోయిన్‌పల్లిలోని శ్రీ మోటార్స్‌తో పాటు శ్రీసాయి మోటర్స్, ఆర్కే మోటార్స్‌ సంస్థలను సంప్రదించాడు. తాము ఇతర సంస్థల కన్నా ఆకర్షణీయమైన అంశాలతో వాహన బీమా పాలసీ ఇస్తామంటూ ఎర వేశాడు. ఇతడి వాక్చాతుర్యానికి బుట్టలో పడ్డ ఆ షోరూమ్స్‌ నిర్వాహకులు వాహనాలకు సంబంధించిన వివరాలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం అందించారు. గతంలో బజాజ్‌ అలయన్జ్‌ సంస్థలో పని చేస్తున్నప్పుడూ కొన్నిసార్లు ఆయా షోరూమ్స్‌కు వెళ్ళిన ఇతడు తన విధిని నిర్వర్తించాడు. అప్పట్లో వాహనాన్ని ఖరీదు చేసిన వారి వివరాలను తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యాప్‌లో నమోదు చేసుకునే వాడు. ఇవి బజాజ్‌ అలయన్జ్‌ సంస్థకు చేరి ఇన్సూరెన్స్‌ పత్రం తయారై వచ్చేంది. శ్రీకాంత్‌ ఆయా షోరూమ్స్‌ను మోసం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఆ వివరాలు నమోదు చేసుకుని వెళ్ళే వాడు. ఇంటర్‌నెట్‌ నుంచి పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన ఇన్సూరెన్స్‌ పత్రాన్ని వర్డ్‌ ఫార్మాట్‌లోకి మార్చేవాడు. ఇందులో పేర్లు, వాహన నెంబర్లు మార్చి తనకు కావాల్సినవి చేర్చేవాడు. ఆపై ప్రింట్‌ తీయడం ద్వారా తయారైన బోగస్‌ పత్రాన్ని ఆయా షోరూమ్స్‌ అందించాడు.

వాహన ప్రమాదంతో వెలుగులోకి...
ఇలా మొత్తం దాదాపు 400 వాహనాలకు సంబంధించి షోరూమ్స్‌ నుంచి డబ్బు వసూలు చేసిన శ్రీకాంత్‌ కేవలం 130 వాహనాలకు మాత్రమే వేరే ఏజెంట్‌తో ఇన్సూరెన్స్‌ చేయించాడు. మిగిలిన వాటికి తానే తయారు చేసిన బోగస్‌వి అందించాడు. ఇలా మొత్తం రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఇతడు అందించిన బోగస్‌ బీమా పత్రాన్ని షోరూమ్‌ ద్వారా అనేక మంది వాహనచోదకులు పొందారు. ఇలాంటి వాహనచోదకుల్లో ఒకరి ద్విచక్ర వాహనం ఇటీవల చోరీకి గురైంది. దీంతో ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన బాధితుడు వాహనానికి సంబంధించి ఇన్సూరెన్స్‌ క్‌లైమ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ కంపెనీని సంప్రదించారు. ఇతడు తీసుకువచ్చిన పత్రంపై ఉన్న నెంబర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసిన కంపెనీ ప్రతినిధులు వేరే వ్యక్తి, వాహన నెంబర్‌తో ఉన్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు షోరూమ్‌ నిర్వాహకుడిని సంప్రదించాడు. వారు శ్రీకాంత్‌ను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బోయిన్‌పల్లి ఠాణాలో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది. ఇతడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్‌ రవి, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం శ్రీకాంత్‌ను పట్టుకుంది. ఇతడి నుంచి బోగస్‌ పత్రాలు, కంప్యూటర్, రబ్బర్‌ స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement