నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా అరెస్ట్‌

Fake Documents Gang Arrest - Sakshi

నలుగురిపై కేసు నమోదు

బద్వేలు మీసేవలోతయారీ ప్రక్రియ

తప్పుడు చిరునామాతోనకిలీ ఓటరు, ఆధార్‌కార్డు  తయారీ

రాజంపేట: జిల్లాలో నకలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు సంపాదించే ముఠాను అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్‌ సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనగలూరుకు చెందిన బసిరెడ్డి వెంకటశివారెడ్డి 2012లో కువైట్‌కు వెళ్లి  యేడాదిన్నర తర్వాత జీతం సరిపోక తిరిగి వచ్చాడు. మళ్లీ వెళ్లాలనుకొనే సమయంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ కావడంతో పాత పాస్‌పోర్టు చెల్లలేదు. దీంతో ఎలాగైనా కువైట్‌కు వెళ్లాలనుకుని తమ గ్రామానికి చెందిన నర్సారెడ్డికి తన సమస్యను చెప్పుకున్నాడు. అతను బద్వేలుకు చెందిన పెంచల్‌రెడ్డి వద్ద నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించి ఇస్తానని  భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత వీరు బద్వేలుకు వెళ్లి పెంచల్‌రెడ్డిని సంప్రదించారు. అతను తప్పుడు చిరునామాతో నకిలీ ఓటరు కార్డు తయారు చేశాడు.

అనంతరం బద్వేలులోని ప్రసాద్‌ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ అనే మీసేవ సెంటర్‌లో యజమాని ప్రసాద్, ఆపరేటర్‌ ఇస్మాయిల్‌ సాయంతో శివారెడ్డి పేరుతో నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి ఆ నెంబరు పైన నకిలీ చిరునామా అప్‌డేట్‌ చేశాడు. ఈ ఆధార్‌తో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసి పాస్‌పోర్టు తీసుకున్నారు. ఈ విధంగా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినందుకు శివారెడ్డి వద్ద పెంచల్‌రెడ్డి రూ.25వేలు డబ్బులు తీసుకున్నాడన్నారు. ఇందులో నర్సారెడ్డి , మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్‌ ఇస్మాయిల్‌కు వాటా ఇచ్చాడన్నారు. ఈనెల 24న మీసేవ యజమాని ప్రసాద్, ఆపరేటర్‌ ఇస్మాయిల్‌తో పాటు శివారెడ్డి, నర్సారెడ్డిలను అరెస్టు చేశామన్నారు. పెంచల్‌రెడ్డి పరారీలో ఉన్నాడన్నారు. శివారెడ్డి ఒరిజనల్‌ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు,  ఓటరు కార్డును సీజ్‌ చేశామని వివరించారు. సమావేశంలో మన్నూరు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు, రూరల్‌ పోలీసులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top