నకిలీ నోట్ల దందా..

Fake Currency Hub Khammam District - Sakshi

ఏటీఎంలలో సైతం బయటకొస్తున్న నోట్లు

బంగ్లాదేశ్‌ నుంచి సరఫరా అవుతున్న కరెన్సీ 

నకిలీ నోట్ల చలామణి మళ్లీ మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా జరిగిన నోట్ల చలామణి ప్రస్తుతం మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే ఏది నకిలీ.. ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి. కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి కూడా రూ.వంద, రూ.500 నోట్లు నకిలీవి వస్తున్నట్లు పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి నకిలీ నోట్లను ఈ ప్రాంతానికి తరలించి.. కొందరు బుకీలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. నోట్ల కట్టల్లో వీటిని జొప్పించి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ నోట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏ నోట విన్నా నకిలీ నోట్లు మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందిన ఓ వ్యక్తి భద్రాచలం ప్రాంతానికి చెందిన మహిళ కలిసి సుమారు రూ.2కోట్ల వరకు నకిలీ నోట్ల వ్యాపారం చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని వారిని అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసులకు నకిలీ నోట్ల వ్యాపారం ఉమ్మడి జిల్లాలో భారీగా నడుస్తుందనే విషయం కూడా తెలిసింది.

ముఖ్యంగా సత్తుపల్లి, పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, కొత్తగూడెం, భద్రాచలానికి చెందిన పలువురు ముఠాగా ఏర్పడి.. నకిలీ నోట్ల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అప్పట్లో పోలీసుల హడావుడి ఎక్కువగా ఉండడంతో కొద్దిమేరకు వారి వ్యాపారం తగ్గించినా.. ఇటీవలి కాలంలో మళ్లీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో పలు పోలీస్‌స్టేషన్లలో సైతం నకిలీ నోట్ల చలామణిపై కేసులు నమోదయ్యాయి.

60–40 పర్సంటేజీ.. 
నకిలీ నోట్ల వ్యాపారంలో ముఖ్యంగా 60–40 పర్సంటేజీ విధానంలో వ్యాపారం సాగుతున్నట్లు తెలిసింది. ఉదా.. నకిలీ నోట్ల వ్యాపారం చేసే వ్యక్తికి రూ.40వేలు ఇస్తే.. వారికి నకిలీ నోట్లు సరఫరా చేసే వ్యక్తి తిరిగి రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తాడు. ఈ మేరకు వారు ఆ నోట్లను అసలైన నోట్ల మధ్యలో పెట్టి చలామణి చేస్తారు. దీనికి సంబంధించి కొందరు బుకీలను సైతం ఏర్పాటు చేసుకుని.. నోట్లను ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌ నుంచి సరఫరా.. 
కోల్‌కతా సరిహద్దు బంగ్లాదేశ్‌ వద్ద గల సిలిగురి ప్రాంతం నుంచి నకిలీ నోట్లు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నకిలీ నోట్లను సరఫరా చేసుకోవడం కోసం కొందరు ముఠాగా ఏర్పడి.. సిలిగురి వెళ్లి అక్కడి నుంచి రైళ్లు, బస్సులు, అవసరమైతే లారీల్లో కూడా సూట్‌కేసులలో దుస్తుల కింద అమర్చి నకిలీ నోట్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. నోట్లలో ఎక్కువగా రూ.100, రూ.500 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏటీఎంలలోకి ఎలా వస్తున్నాయి? 
ఇటీవలి కాలంలో నేరుగా నకిలీ నోట్లు ఏటీఎంలలో కూడా వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఎంలలో నకిలీ నోట్లు రావడానికి బ్యాంకు సిబ్బందికి.. నకిలీ నోట్ల ముఠాకు సంబంధం ఉండడం.. లేదా ఏటీఎంలలో డబ్బులు పెట్టే ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వారితో సంబంధాలు ఉండి ఉండవచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పోలీసుల నిఘా తగ్గడంతో మళ్లీ ఉమ్మడి జిల్లాలో నకిలీ నోట్ల వ్యాపారం ఊపందుకుంది. వాస్తవానికి నకిలీ నోట్ల వ్యవహారానికి సంబంధించి సీఐడీ అధికారులు కేసులను దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే వారెక్కడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తుంటారు. వెంటనే పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు.

దుకాణంలో తేలింది..
సతీష్‌(పేరు మార్చాం) నగరంలోని ఏటీఎంలోకి వెళ్లి రూ.వెయ్యి డ్రా చేశాడు. రూ.500 నోటుతోపాటు రూ.100 నోట్లు ఐదు వచ్చాయి. వాటిలో నుంచి వంద నోట్లు మూడు తీసి సరుకులు కొనుగోలు చేశాడు. సతీష్‌ ఇచ్చిన నోట్లలో ఒక నోటును షాపు యజమాని మళ్లీ సరుకు కొనుగోలు చేసిన వ్యక్తికే ఇచ్చాడు. ఇదేమిటంటే.. అది నకిలీ నోటు అని తేల్చి చెప్పాడు.

దీంతో బిత్తరపోయిన సతీష్‌.. ఇప్పుడే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశానని షాపు యజమానితో వాదనకు దిగాడు. దీంతో షాపు యజమాని అసలు నోటు, నకిలీ నోటుకు తేడా చూపించడంతో సతీష్‌ నోరెళ్లబెట్టాడు. అయితే ఏటీఎంకు సంబంధించిన బ్యాంకుకు సతీష్‌ వెళ్లి విచారణ చేయగా.. మాకు సంబంధం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయండి అంటూ బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. చేసేది లేక సతీష్‌ ఇంటిదారి పట్టాడు.

నకిలీ’ని అరికట్టాలి.. 
నకిలీ నోట్ల చలామణిని అరికట్టేందుకు పోలీసు లు, బ్యాంకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ నోట్లను చలామణి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, ప్రైవేట్‌ లెక్చరర్‌ 
 

‘100’కు సమాచారం ఇవ్వాలి.. 
ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. అక్కడ పట్టించుకోకపోతే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. డ్రా చేసిన రశీదును దగ్గర పెట్టుకోవాలి. నకిలీ నోట్లు నంబర్‌ను స్కాన్‌ చేసినప్పుడు తెలిసిపోతుంది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.  – వెంకట్రావు, ఖమ్మం ఏసీపీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top