మార్కెట్‌లో నకిలీ విత్తు!

Fake Cotton Seeds Seized In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి : జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 36 వేల ఎకరాలు. గతేడాది 49,873 ఎకరాల్లో పంట సాగైంది. ఈసారి కూడా సాధారణ సాగు విస్తీర్ణం కంటే ఎక్కువగా పత్తి సాగవుతుం దని భావిస్తున్నారు. విత్తనాల అవసరం ఎక్కు వగా ఉండడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు జిల్లాపై కన్నేశారు. విత్తనం కొనుగోలు చేసిన రైతులకు విత్తనం అసలైనదో, నకిలీదో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి దోచుకుంటున్నారు.

ఇటీవల 44వ జాతీయ రహదారి మీదుగా కారులో నకిలీ విత్తనాలను తరలిస్తుండగా భిక్కనూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. అందులో రూ. 2.20 లక్షల విలువైన 296 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లున్నాయి. హైదరాబాద్‌ నుంచి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విత్తనాలకు సంబంధించి సరైన పత్రా లు లేకపోవడంతో అవి అనుమతి లేని కంపెనీలకు చెందిన విత్తనాలని, నకిలీవని గుర్తించారు. నకిలీ విత్తనాలను కారులో సరఫరా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

ఇరు రాష్ట్రాల నుంచి... 

పత్తి విత్తన కంపెనీలు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు కామారెడ్డి జిల్లాకు వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్‌ గల్, పిట్లం తదితర మండలాల్లో పత్తి పంట ఎక్కు వగా సాగవుతుంది. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి అక్కడి నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు చేరుతున్నాయి.

ఇప్పటికే వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. పత్తి పూత దశకు వచ్చిన తరువాతే విత్తనం నాణ్యత తెలుస్తుంది. ఇప్పటికే విత్తనం వేసిన రైతులు మొలకలు రావడంతో పంటను సంరక్షించే పనిలో ఉన్నారు. మరికొందరు విత్తనం వేస్తున్నారు. కామారెడ్డి ప్రాంతంలోని గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి తదితర మండలాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి ఏపీ నుంచి ఎక్కువగా విత్తనాలు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలతో రైతులు తెలియకుండానే మోసపోతున్నారు.

నామమాత్రపు తనిఖీలు..

నకిలీ విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో తిరుగుతూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే నేరుగా దందా చేసేవారు దుకాణాల్లో నకిలీ విత్తనాలను ఎవరూ నిల్వ ఉంచుకోరు. కానీ అధికారులు మాత్రం దుకాణాలను తనిఖీ చేసి వెళుతున్నారు. మద్యం బెల్టు దుకాణాల్లాగే నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి లైసెన్సులు లేకుండానే గ్రామాల్లో కొందరు దళారులు విక్రయాలు జరుపుతున్నారు.

గ్రామాల్లో విత్తనాలు అమ్మేవారి ఇళ్లు, గోదాములపై దాడులు చేస్తే నకిలీ విత్తన గుట్టు రట్టయ్యేది. కాని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడా నకిలీ విత్తనాలను పట్టుకున్న దాఖలాలు లేవు. జాతీయ రహ దారి మీదుగా నకిలీ విత్తనాలను తీసుకెళుతున్న కారును పోలీసులు పట్టుకుని విచారిస్తేగాని నకిలీ విత్తనాలని తేలలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top