అప్రమత్తతే రక్ష

Facebook Fake Accounts Complaints In Hyderabad - Sakshi

అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు

చాటింగ్‌తో లైన్‌లోకి దింపి వ్యక్తిగత ఫొటోలు, వీడియోల సేకరణ

బెదిరింపులు, డబ్బు డిమాండ్‌

మల్కాజిగిరికి చెందిన అభిషేక్‌ గౌడ్‌ నకిలీ ఫేస్‌బుక్‌ యూజర్‌ ఐడీ ‘వర డార్లింగ్‌’ను సృష్టించి అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. ప్రొఫైల్‌లో అమ్మాయి ఫొటో ఉండటంతో అమ్మాయిగా భావించి పలువురు యువతులు ఆమోదించారు. ఆ తర్వాత అతను వీడియో చాట్‌కు రావాలని నగ్నంగా కనబడాలని కోరే వాడు. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన అమ్మాయిల ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి బాధితుల ఫేస్‌బుక్‌ మెసేంజర్‌కు పంపేవాడు. గతేడాది అక్టోబర్‌ 10న రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఓ బాధితురాలిని కూడా ఇదే తరహాలో మెసేజ్‌ పంపాడు. తన మెసేజ్‌లకు స్పందించకపోతే ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌తో పాటు పోర్న్‌ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో గత డిసెంబర్‌ 4న నిందితుడిని అరెస్టు చేశారు.  

సాక్షి, సిటీబ్యూరో:  ఇలాంటి ఘటనలు కేవలం ఒకరు, ఇద్దరు యువతులకే పరిమితం కావడం లేదు. వందల సంఖ్యలో విద్యార్థినులు, యువతులు, మహిళలు ఇదే తరహా వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో తమ చిత్రాలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీటిని విశ్లేషించిన పోలీస్‌ అధికారులు అపరిచితులు పంపిన చిత్రా లు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ ఖాతాలతో జరభద్రం...
ఫేస్‌బుక్‌ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్‌ క్రై మ్‌ అధికారులు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, కామెంట్స్‌కు ‘లైక్‌’ కొట్టడం ప్రమాదాలను కొనితెచ్చుకోవడమేనన్నారు. స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, విహారయాత్రలు, పెళ్లిళ్ల సమయంలో తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో సైబర్‌ నేరగాళ్లు వీటిని  దుర్వినియోగం చేస్తున్నారు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి వస్తున్న నేరగాళ్లు, యువతులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరికలు చేస్తున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసిన వారు కూడా ఉండటం గమనార్హం. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. తమ చిత్రాలను అసభ్యంగా మార్చి ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నారని సైబర్‌ క్రై మ్‌ పోలీస్‌ ఠాణాకు వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  

బ్లాక్‌మెయిలింగ్, డబ్బులు డిమాండ్‌...
యువతులు, విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తుండటం కూడా తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఈ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్న నిందితులు ఫేస్‌బుక్‌ ద్వారా వారితోనే చాట్‌చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. దారిలోకి రాకుంటే వారి వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. గతంలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్న బీటెక్‌ విద్యార్థి మాజీద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులతో ఫేస్‌బుక్‌లో అమ్మాయిగా పరిచయం పెంచుకొని వ్యక్తిగత వివరాలు సేకరించి వేధింపులకు గురిచేశాడు. కొందరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి తన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. చివరకు ఓ విద్యార్థి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఎవరైనా వేధింపులు తీవ్రమైనప్పుడు మాత్రమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న సైబర్‌ నేరగా>ళ్లు బ్లాక్‌మెయిల్‌ చేసి బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా వాడుకుంటున్నారు.  

 సగానికిపైగా ఇవే...
గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,200కు పైగా కేసులు నమోదు కాగా, ఇందులో 600కుపైగా కేసులు సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిల వేధింపులకు సంబంధించినవే. సెక్షన్‌ 292, 201, 354 (ఈ), 507 ఐపీసీ, సెక్షన్‌ 66 (సీ), 66 (ఈ ),67, 67 (ఏ) ఐటీ యాక్ట్‌ కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.    

వ్యక్తిగత చిత్రాలు..వీడియోలొద్దు  
ఫేస్‌బుక్‌లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్న నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. అమ్మాయిలు ఫేస్‌బుక్‌లో తెలియని వారి నుంచి వచ్చిన ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్‌ చేయవద్దు. అమ్మాయే కదా అని స్పందిస్తే ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంతో పాటు ఫొటోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. కొందరు శారీరకంగా లొంగదీసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. మరికొందరు డబ్బుల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.  
–మహేష్‌ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్‌   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top