ఫేస్‌బుక్‌ పరిచయంతో చీటింగ్‌

Facebook Cheater Arrest In East Godvari - Sakshi

ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా

విలాసవంతమైన జీవితం, గుర్రపు పందాలతో జోష్‌...ఖరీదైన వాహనాల్లో రయ్‌...రయ్, లగ్జరీ సూట్లలో హల్‌చల్‌...చూస్తే వీఐపీ పోజు ... చేసే పనులన్నీ మస్కా... ఇందుకు చేతినిండా డబ్బులు కావాలి...అందుకే ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయాలు పెంచుకొని అవతలివారిని ‘బుక్‌’ చేయడం హాబీగా మార్చుకున్నాడు ఆ యువకుడు. అమరావతి సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా ఓ యువతిని పరిచయం చేసుకుని, జ్యుడీషియల్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దశలవారీగా రూ.16.50 లక్షలు స్వాహా చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. 

తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం రూరల్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 లక్షలు కాజేసిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్‌ దీపక్‌ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.10 వేలు, ఒక ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోను ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు మొబైల్‌ ఫ్యాన్సీ నంబర్లు ఇస్తానని చెప్పి రూ.30 లక్షలు కాజేసిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. దీపక్‌ ఏపీ సెక్రటరీయేట్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతూ ఫేస్‌బుక్‌లో పలు పరిచయాలు పెంచుకున్నాడు. శాటిలైట్‌ సిటీ గ్రామానికి చెందిన దొండపాటి దుర్గ అనే యువతికి దీపక్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో నిందితుడు(ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన చిత్రం)
ఆమె పిన్నికుమార్తె బోనగిరి శేషారత్నానికి న్యాయశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె తల్లిదండ్రుల నుంచి తన అకౌంట్‌లో రూ.16.50 లక్షలు వేయించుకున్నాడు. సొమ్ములు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా, వారిని నమ్మించేందుకు బెంగళూరులో ఇటీవల జరిగిన న్యాయశాఖ ఉన్నతాధికారులు సమావేశం వద్దకు తీసుకువెళ్లి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తయారవుతోందని, ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఈ నెల13న శేషారత్నం తాత ఊరా రాముడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాను వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, బెంగళూరులలో గుర్రపు పందాలు, స్టార్‌ హోటళ్లలో దిగి వాడేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడికి స్కేటింగ్‌లో కుడికాలు పోయిందని..కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా తూర్పుమండల డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top