ఇంటర్వ్యూకు వెళుతుండగా..

Engineering Student Died in East Godavari - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి

ఏలూరు నుంచి కాకినాడ వెళుతూ..

మోటారు సైకిల్‌ను ఢీకొని గోదావరి కాలువలో బోల్తా పడిన లారీ

వారు ఇంజినీరింగ్‌విద్యార్థులు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునే పనిలో పడ్డారు.  కాకినాడలో జరుగుతున్న ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు పయనమయ్యారు. అయితే గమ్యం చేరకుండానే మృత్యువు వారి ఆశలను చిదిమేసింది. లారీ రూపంలో వారిని కబళించింది.

తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట కెనాల్‌ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న విద్యార్థులు కాకినాడ వెళుతుండగా.. స్థానిక సుగర్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ సమీపంలో సామర్లకోట నుంచి బిక్కవోలు వైపు వెళుతున్న ఎరువుల లోడ్‌ లారీ ఎదురుగా వీరి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బీబీఏ చదువుతున్న ఎస్‌కే రభానీ(22) షేక్‌ అనీఫ్‌(22) అక్కడికక్కడే మృతి చెందారు. మోటారు సైకిల్‌ను ఢీ కొన్న లారీ అదుపు తప్పి గోదావరి కాలువలో బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనర్లు పరారయ్యారు.

కాకినాడలో ఇంటర్వ్యూకు హాజరు కావడానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న బ్యాగులలోని ఐడీ కార్డుల ద్వారా వారు ఏలేరు ఆదిత్య కళాశాలలో చదువుతున్నట్టు గుర్తించారు. కెనాల్‌ రోడ్డు ఇరుకుగా ఉండడంతో పాటు చెరకు క్రషింగ్‌ కోసం వస్తున్న వాహనాలతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్సై ఎల్‌. శ్రీనివాసు నాయక్‌ సంఘటన ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించి, కళాశాల యాజమాన్యం, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులకు హెల్మెట్‌ లేకపోవడం వల్లే తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు, బందువులు, స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని పోలీసుల నుంచి వివరాలు తెలుసుకొని వారివారి కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top