అల్లినగరంలో అలజడి

Elderly man Suspicious Death In Srikakulam - Sakshi

పాఠశాలలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న వృద్ధుడు

మృతుడిది లావేరు మండలం   పెద్దరావుపల్లి గ్రామం

అనుమానాస్పద మృతిగా పోలీసుల కేసు నమోదు

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: అల్లినగరం గ్రామంలో గురువారం అలజడి నెలకొంది. వృద్ధుడి మృతి కలకలం రేపింది.  తెల్లవారుజామున 5.30 గంటలకు కొందరు గ్రామస్తులు వ్యక్తిగత పనులు మీద జాతీయ రహదారి వైపు వెళ్లారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓ చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఉన్న వృద్ధుడి మృతదేహం చూశారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఫిర్యాదు కోసం నిరీక్షించారు. మృతి చెందింది ఎవరు అన్న అంశం ఈ ప్రాంతంలో చర్చనీయంశంగా మారింది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. ఉపాధ్యాయులు కార్యాలయం గదికి చేరుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు, జేఆర్‌ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్‌ఐ వై.కృష్ణ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పాఠశాలలో పడివున్న విషయం పక్క గ్రామాలకు వ్యాపించింది. లావేరు మండలం పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన మజ్జి రాములు(66) బుధవారం రాత్రి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఈ పాఠశాల వద్దకు చేరుకున్నారు. తన భర్త మృతదేహంగా భార్య లక్ష్మి గుర్తించి ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

హత్య చేశారని అనుమానాలు
మృతి చెందిన మజ్జి రాములు అల్లినగరం పాఠశాల ఆవరణలో చెట్టుకు లుంగీతో ఉరివేసుకున్నట్టు ఉంది. లుంగీ ఉండాల్సిన స్థానంలో తువ్వాలు కట్టుకుని ఉండి చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్టు ఉంది. నేలకు శరీరం తాకి ఉంది. చెట్టు కొమ్మ నేలకు తక్కువ ఎత్తులో ఉండటం, ఉరివేసుకునేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవటం, శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉండటం, పక్కన ఉన్న చెట్టుకు రక్తం మరకులు అంటి ఉండటం వంటి అంశాలు హత్య జరిగి ఉంటుందన్న సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. మరో పక్క నిరుపేద కుటుంబం కావటం, మృతుడు రోజు కూలీ కావటం, భార్య, ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్న ఈయనకు ఇతర కుటుంబాలతో విభేదాలు లేకపోవటం వంటి అంశాలు పరిశీలిస్తే హత్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉంది. మద్యం దుకాణం వద్ద గొడవులు జరిగి ఉంటాయని, ఈ సమయంలో హత్య జరిగే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. మరో పక్క ఈయన దగ్గర స్వల్ప మొత్తంలో  డబ్బులు ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేసేటంతటి శత్రువులు తమకు లేని అంటున్నారు. కాగా, పెద్దలు సమక్షంలో పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతందేహం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక స్పష్టత
మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు ఆధారంగా ఎచ్చెర్ల పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జేఆర్‌ పురం సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ వై.కృష్ణ మాట్లాడుతూ వైద్యుల నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. మద్యం మత్తులో చెట్టుకు గుద్దుకోవటం, లుంగీతో ఉరివేసుకోవటంతో మృతి చెంది ఉండవచ్చునని, ఉరివేసుకొని మృతి చెందిన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని, ప్రస్తుతం పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top