ఇక.. ఈ–చలాన్‌

E Challan Technology Use Mahabubnagar Police - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్‌ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు నోటీసును రాసే విధానంలో కాకుండా ఆన్‌లైన్‌లో అందించనున్నారు. అంతేకాకుండా జరిమానాను సైతం నగదు రూపంలోస్వీకరించే విధానానికి స్వస్తి పలుకుతూ మీ–సేవ, ఈ–సేవ కేంద్రాలతో పా టు పేమెంట్‌ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా వాహనదారులు తమ పేరిట ఉన్న చలాన్లు, చెల్లించిన జరిమానా ను ఆన్‌లైన్‌లో చూసుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకాలం ట్రాఫిక్‌ పోలీసులపై ఉన్న విమర్శలకు చెక్‌ పెట్టేలా క్యాష్‌లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు.

క్యాష్‌లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 
ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను భౌతికంగా ఆపి చలానా విధించి అక్కడిక్కడే డబ్బు కట్టించేవారు. ఈ ప్రక్రియలో కింది స్థా యి సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చేవి. పారదర్శకత లోపించడం ద్వారా ట్రాఫిక్‌ పోలీసుల పనితీరుపై మచ్చ పడుతోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి చెప్పిన మహబూబ్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు క్యాష్‌లెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై పోలీసులు జరిమానాను నగదు రూపంలో వసూలు చేయకుండా నేరుగా వాహనదారుడు పేమెంట్‌ గేట్‌వే ద్వారా చెల్లించగల విధానాన్ని ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంగించిన వారికి పోలీసులు ఈ–టికెట్‌ జారీ చేసి జరిమానా చెల్లించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తారు. ఇలా జారీ చేసిన ఈ–టికెట్లు మించినట్లయితే రిజిస్ట్రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వావానాన్ని స్వాధీనం చేసుకుని జరిమానా విధించిన తర్వాతే విడుదల చేస్తారు.

ఇంటికే ఈ–చలాన్‌ 
ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియమాలను అతిక్రమించే వారిని ట్రాఫిక్‌ పోలీసులు కెమెరాలతో వీడియో, ఫొటోలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌లో భద్రపరుస్తారు. అనంతరం తగిన సాక్ష్యాధారాలతో ఈ–చలాన్‌ను వాహనదారుడి ఇంటికి పంపిస్తారు. అంతేకాకుండా పెండింగ్‌ చలాన్ల వివరాలను వెబ్‌సైట్లలోకి వెళ్లి తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. ఆ తర్వాత జరిమానాను వాహనదారులు ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా వాహనదారులు చెల్లించిన జరిమానా వివరాలను వెంటనే డేటాబేస్‌లో ఆప్‌డేట్‌ చేస్తారు. 

లీగల్‌ నోటీసు 
నిబంధనలు ఉల్లంఘించే వారికి ఎప్పటికప్పుడు ఈ–చలా న్లు జారీ చేయనున్నారు. ఆ వెంటనే ఏడు రోజుల్లోగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టకుండా పెండింగ్‌ చలాన్లు పేరుకుపోయిన వారి పేరిట స్పీడ్‌పోస్టులో లీగల్‌ నోటీసులు పంపిస్తారు. అయినప్పటికీ స్పందించకపోతే న్యాయస్థానంలో చార్జీషీట్‌ దాఖలు చేయనున్నారు. 

సాక్షాధారాలతో సహా ఇంటికే జరిమానా పత్రం 
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా జిల్లాలో ఈ–చలాన్‌ పద్ధతి ప్రవేశపెట్టాం. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి బాధ్యులను గుర్తించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ, జరిమానా విధిస్తున్న పద్ధతికి స్వస్తి పలికి.. కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా వాహన యజమాని ఇంటికే జరిమానా పత్రం పంపిస్తాం. తపాలా, మొబైల్‌ఫోన్, పోలీసు వెబ్‌సైట్‌ల ద్వారా ఈ–చలాన్‌ జరిమానా వివరాలు తెలుసుకుని చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమల్లో ఉండి సత్ఫలితాలు ఇస్తున్న ఈ విధానాన్ని మరికొన్ని జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పాలమూరులో కూడా ప్రవేశపెట్టాం. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top