
ఆవగూడెంలో కూలిపోతున్న రోడ్డు అంచులు
గరివిడి, విజయనగరం : మండలంలోని వెదుళ్లవలస పంచాయతీ మధుర గ్రామమైన ఆవగూడెంలో జరుగుతున్న మైనింగ్ ప్రమాదకరంగా మారుతోంది. సంబంధిత మైనింగ్ యజమానులు పరిమితులకు మించి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టకపోవడం వల్లే యాజమానులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి సమీపంలో ఓ కంపెనీ వారు మాంగనీస్ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ సేకరించిన మెటీరియల్‌ను గరివిడిలోని ఫెర్రో అల్లాయీస్ కర్మాగారానికి తరలిస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ రస్తాలకు, రహదారులకు 20 గజాల దూరంలో మైనింగ్ చేపట్టాలి. అయితే ఆవగూడెంలో మాత్రం రహదారికి కేవలం ఐదు గజాల దూరం వరకు మైనింగ్ చేస్తూ వచ్చేశారు. పైగా మైనింగ్ లోతు కూడా సుమారు 300 అడుగుల లోతు ఉంది.
దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగించే వారు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా పెను ప్రమాదం తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా గ్రామ సమీపంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. రహదారికి ఆనుకుని వర్షాధార కాలువ ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ వైపుగా ప్రయాణం చేయాలంటేనే వాహనచోదకులు భయాందోళన చెందుతున్నారు.
అదే దారిలో మరికొన్ని..
మండలంలోని ఆవగూడెంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా మైనింగ్ జరుగుతోంది. వెదుళ్లవలసతో పాటు దేవాడ గ్రామాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతోంది. రహదారులకు అతి సమీపంలో మైనింగ్ జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడే పరిశీలనలకు వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.