సైబర్‌ టెర్రర్‌    | Cyber Terror | Sakshi
Sakshi News home page

సైబర్‌ టెర్రర్‌   

May 5 2018 12:57 PM | Updated on Aug 11 2018 8:54 PM

Cyber Terror - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : రాజధానిలో సైబర్‌ నేరస్తు లు పంజా విసురుతున్నారు.రోజు రోజుకూ సరికొత్త పోకడలతో ముందుకెళుతూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. స్వీట్‌ వాయిస్‌తో ప్రజలను బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలు,  క్రెడిట్‌కార్డులు ఖాళీ చేయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తీరా తాము మోసపోయిన తరువాత బాధితులు సైబర్‌  పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  అందుకు ప్రధాన కారణం సరిపడా సిబ్బంది లేకపోవడమే. గత యేడాదితో పోల్చి తే ఈ సంవత్సరం సైబర్‌ నేరాలు నగరంలో పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.  

సైబర్‌ స్టేషన్‌కు జవసత్వాలెప్పుడు? 

సైబర్‌ నేరాల దర్యాప్తునకు ఏర్పాటైన సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు జవసత్వాలు నింపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు అదనపు సిబ్బంది అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఉన్న 48 మందికి అదనంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ సీపీకి ప్రతిపాదనలు పంపారు. భవిష్యత్తులో అవసరాలను మదించి ఈ సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే నేరాలు పెరుగుతున్నా సిబ్బంది  సంఖ్యమాత్రం అలాగే ఉండిపోయింది.  

8 ఏళ్ల క్రితం నాటి కేటాయింపులే... 

నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాలను దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లల్లో సీసీఎస్‌ ఆధీనంలో సైబర్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. 2010లో ప్రభుత్వం సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వం వహించేలా... సహకరించేందుకు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు.

గడిచిన ఎనిమిదేళ్లల్లో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్‌ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ దర్యాప్తు అధికారులను సైతం ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ మోసగాళ్లతో పాటు నైజీరియన్‌ ముఠాలు, డేటా థెఫ్ట్‌ తదితరాలు పెరుగుతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్‌తో పాటు ఎస్‌ఎమ్మెస్, ఈ–మెయిల్‌ మోసాల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

95 శాతం బయటి వారే... 

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్ల పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటీషన్లు వస్తున్నాయి. గత ఏడాది 325 కేసులు నమోదు కాగా... ఆరు వేల పిటీషన్లు వచ్చాయి. ఈ ఏడాది మార్చి వరకు 108 కేసులు నమోదు కాగా, 3 వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్‌ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు.

వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ప్రస్తుత సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఈ కేసుల్లో నిందితుల్లో అత్యధికులు బయటి రాష్ట్రాలకు చెందిన వారేనని అధికారులు తెలిపారు. వారిని గాలిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో  ఇక్కడ కేసుల దర్యాప్తు ఆగిపోతోంది. ఫలితంగా కేవలం 35 శాతం కేసులనే కొలిక్కి తీసుకురాగలుగుతున్నారు.  

19 మంది అత్యవసరం... 

సైబర్‌ నేరాల దర్యాప్తు నుంచి సాక్ష్యాధారాల సేకరణ, విశ్లేషణ, భద్రపరచడం వరకు కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ తదితరాల ఆవశ్యకత ఎంతో ఉంది. దీనికోసం గతేడాది అత్యాధునిక సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. అప్పటికే అరకొరగా ఉన్న సిబ్బం దిలో కొందరిని దీనికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ ప్రతిపాదనలు పం పారు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఈ నెలా ఖరు నాటికి అదనపు సిబ్బంది వచ్చే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement