మళ్లీ ‘ర్యాన్సమ్‌వేర్‌’ టెన్షన్‌ | Cyber criminals targeted BSNL | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘ర్యాన్సమ్‌వేర్‌’ టెన్షన్‌

Jul 21 2018 1:25 AM | Updated on Jul 21 2018 9:01 AM

Cyber criminals targeted BSNL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది ప్రపంచ దేశాలను వణికించిన ‘ర్యాన్సమ్‌వేర్‌’మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్‌ టెలికం డిస్ట్రిక్ట్‌ సర్వర్‌ను టార్గెట్‌ చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. డేటాను విడుదల చేయాలంటే బిట్‌కాయిన్స్‌ రూపంలో 800 డాలర్లను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వారు డిమాండ్‌ చేసిన మొత్తం చెల్లించకపోవడంతో కొంత డేటాను క్రాష్‌ చేశారు. ఈ నెల 9వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ సైబర్‌ దాడి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

సిస్టమ్స్‌తోపాటు సర్వర్‌ లాక్‌ 
హైదరాబాద్‌ టెలికం డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన సర్వర్‌ టెలిఫోన్‌ భవన్‌లో ఉంది. ఈ వెబ్‌ సర్వర్‌ను అంతర్గత సమాచార మార్పిడి(ఇంట్రానెట్‌) కోసం వినియోగిస్తుంటారు. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి 12.27 గంటలకు ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌లను సైబర్‌ నేరగాళ్లు ఈ మెయిల్‌ రూపంలో పంపినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వైరస్‌ కంప్యూటర్లలోకి ప్రవేశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్‌ అయిపోయి సిస్టమ్స్‌తోపాటు సర్వర్‌ సైతం లాక్‌ అయింది. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ హైదరాబాద్‌ టెలికం డిస్ట్రిక్ట్‌ ఇంట్రానెట్‌లోని డేటా ఎన్‌క్రిప్షన్‌ నాన్‌–సెమెట్రిక్‌ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్‌ కీ’ని ట్రాక్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంట్రానెట్‌లో ఉన్న ఒక్కో హెచ్‌టీఎంఎల్‌ ఫైల్‌.. ఒక్కో ఫోల్డర్‌గా మారింది.  

800 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ 
ఎన్‌క్రిప్టెడ్‌ డేటాను డీక్రిప్ట్‌ చేయడానికి తమకు 800 అమెరికన్‌ డాలర్లు బిట్‌కాయిన్స్‌ రూపంలో చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేస్తూ పాప్‌అప్స్‌ పంపారు. దీనికి నిర్ణీత గడువు సైతం విధించారు. దీనికి బీఎస్‌ఎన్‌ఎల్‌ అంగీకరించకపోవడంతో గంటలోనే కొంత డేటాను క్రాష్‌ చేశారు. ర్యాన్సమ్‌వేర్‌ ప్రభావంతో క్రాష్‌ అయిన డేటా ప్రస్తుతం రిట్రీవ్‌ చేసే స్థితిలో లేకుండా పోయింది. దీనిపై బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌–డివిజినల్‌ ఇంజనీర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) లక్ష్మణ్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ అటాక్‌ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్‌ నేరగాళ్లు ఏ విధానంలో డబ్బు చెల్లించమని చెప్పారు? తదితర అంశాలను సైబర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ముఖ్యం కాకపోయినా.. సాఫ్ట్‌వేర్‌ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీవో ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్‌ కీ ఏర్పాటు చేయరని, దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ– మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉం డటం, కంప్యూటర్‌లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. అయితే ర్యాన్సమ్‌వేర్‌ దాడితో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆ సంస్థ, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వినియోగదారుల డేటా భద్రంగా ఉందని, అది ఇంట్రానెట్‌ సర్వర్‌లో ఉండదని చెపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement