కోల్‌కతాలో విత్‌డ్రా!

Cyber Criminals Money Withdraw in Kolkata With Indian IP Address - Sakshi

భారత్, నైజీరియాలకు చెందిన ఐపీ అడ్రస్‌లు

రూ.35.89 లక్షల కేసులో కీలకాధారాలు లభ్యం

దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు   

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి సిమ్‌కార్డ్‌ బ్లాక్‌ చేసి, ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి రూ.35.89 లక్షలు కాజేసిన కేసులో నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ గ్యాంగ్‌ ఇంటర్‌ నెట్‌ వినియోగించిన ఐపీ అడ్రస్‌లు నైజీరియా, భారత్‌లకు చెందినవి కాగా... ఆ డబ్బు కోల్‌కతాకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిందని, అక్కడే విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. వ్యవస్థీకృతంగా సాగిన ఈ నేరంలో సూత్రధారులు ఎవరనేది తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి వినయ్‌తో పాటు అతడి తల్లి, తండ్రి పేరుతో డీసీబీ బ్యాంకులో ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు ఉన్నాయి.

ఏదైనా రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తం ఈ ఖాతాల్లోకి వచ్చి పడుతుంది. అయితే మంజూరైన మొత్తానికి, మంజూరైన రోజు నుంచి వడ్డీ పడదు. కేవలం వినియోగించుకున్న నగదుకు, ఆ రోజు నుంచి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీటినే సాంకేతిక పరిభాషలో ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలు అంటారు. వినయ్‌ తన వ్యాపార లావాదేవీల కోసం యాహూ మెయిల్‌ ఐడీతో పాటు రెండు ఫోన్‌ నంబర్లను అనుసంధానించారు. గత నెలలో ఈ సిమ్‌ కార్డులు హఠాత్తుగా బ్లాక్‌ అయ్యాయి. వినయ్‌కు చెందిన అధికారిక మెయిల్‌ హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అందులో ఉన్న వివరాల ఆధారంగా ఆ సంస్థకు చెందిన మూడు ఓడీ ఖాతాల నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను తెలుసుకున్నారు. వీటిని వినియోగించి ఆ ఖాతాలను హ్యాక్‌ చేశారు. మరో ఐపీ నుంచి నెట్‌ బ్యాంకింగ్‌లోకి ఎవరో ప్రవేశించారనే సందేశం కూడా వినయ్‌కు చేరకుండా ఆయన సిమ్‌కార్డు బ్లాక్‌ చేశారు.

దీంతో ఆ సమాచారం కేవలం వినయ్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అధికారిక ఈ–మెయిల్‌కు వెళ్లింది. అప్పటికే దాన్ని సైబర్‌ నేరగాళ్లు  తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఈ మెయిల్స్‌ వినయ్‌ దృష్టికి వెళ్లకుండానే డిలీట్‌ చేయగలిగారు. ఆపై నెట్‌ బ్యాంకింగ్‌లోని ప్రొఫైల్‌ ఐడీని హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐసీఐసీఐ, ఆర్‌బీఎస్‌ బ్యాంకులకు చెందిన ఆరు ఖాతాలను బెనిఫిషియరీలుగా యాడ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓటీపీలు మెయిల్‌కు రావడంతో వారి పని తేలికైంది. ఇలా ‘ప్లాట్‌ఫామ్‌’ సిద్ధం చేసుకున్న వీరు ఆర్టీజీఎస్‌ ద్వారా వినయ్, ఆయన తండ్రి, తల్లి పేర్లతో ఉన్న ఓడీ ఖాతాల్లోంచి రూ.35.89 లక్షలను కోల్‌కతాకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకుని, ఆ మొత్తాన్ని అక్కడే డ్రా చేసేశారు.  తన సిమ్‌ బ్లాక్‌ అయిన విషయం గుర్తించిన వినయ్‌ అనుమానం వచ్చి బ్యాంకు ఖాతాలు సరిచూడగా... వాటి నుంచి భారీ మొత్తం మాయమైనట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సైబర్‌ నేరగాళ్లు ఆయా బ్యాంకు ఖాతాలను యాక్సస్‌ చేయడానికి వినియోగించిన ఇంటర్‌నెట్‌ ఐపీలు లాగోస్‌ ఆఫ్‌ నైజీరియా, ఢిల్లీ, ముంబైలకు చెందినవిగా తేలాయి.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వ్యవస్థీకృత ముఠా పనిగా అనుమానిస్తున్నారు. ఈ నేరం నమోదైన రెండు రోజులకు సిటీలో ఇదే తరహాకు చెందిన మరోటి వెలుగులోకి వచ్చింది. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారి శ్రీహర్ష సిమ్‌కార్డు బ్లాక్‌ చేసి, ఆయన మెయిల్‌ ఐడీ హ్యాక్‌ చేసిన నేరగాళ్లు అతడి బ్యాంకు ఖాతాలోని రూ.50 లక్షలు కాజేశారు. ఈ నగదు సైతం కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లడంతో పాటు అక్కడే విత్‌డ్రా అయింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండు నేరాలు చేసిందీ ఒకే ముఠానా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నేరగాళ్లు వినియోగించిన కోల్‌కతాలోని ఐసీఐసీఐ, ఆర్‌బీఎస్‌ బ్యాంకులకు సంబంధించిన ఖాతాలు, దానికి లింకై ఉన్న నంబర్లు సంగ్రహించడం ద్వారా అనుమానితుల్ని గుర్తించాలని నిర్ణయించారు. ఆ ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు కోవిడ్‌ ఉధృతి తగ్గిన తర్వాత ఓ ప్రత్యేక బృందాన్ని కోల్‌కతా పంపాలని నిర్ణయించారు. ఆ తర్వాతే ఈ స్కామ్‌ల సూత్రధారులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top